
హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలో ఉన్న శీతల ఎడారి జీవావరణానికి యునెస్కో గుర్తింపు లభించింది. ఈ ప్రాంతం 7,700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. దీనిని ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తించింది. ఈ గుర్తింపును పారిస్‌లో జరిగిన యునెస్కో మ్యాన్ అండ్ ది బయోస్పియర్ (ఎంఏబీ) అంతర్జాతీయ సమన్వయ సమితి 37వ సమావేశంలో ప్రకటించారు. యునెస్కో గుర్తింపు వల్ల ఈ ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. పర్యావరణ పరిరక్షణకు, పరిశోధనలకు అంతర్జాతీయ సహకారం లభిస్తుంది. తాజాగా గుర్తించిన ప్రాంతంతో కలిపి భారతదేశంలో యునెస్కో రక్షిత ప్రాంతాల సంఖ్య 13కు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 142 దేశాల్లో యునెస్కో గుర్తించిన శీతల ఎడారి జీవావరణ ప్రాంతాల సంఖ్య 142కు చేరుకున్నాయి. ఈ సంవత్సరం 21 దేశాల్లోని 26 ప్రాంతాలకు ఈ గుర్తింపు లభించింది.
మ్యాన్ అండ్ ది బయోస్పియర్
1971లో యునెస్కో ప్రారంభించిన ఒక అంతర్ ప్రభుత్వ శాస్త్రీయ కార్యక్రమమే మ్యాన్ అండ్ బయోస్పియర్. దీని ప్రధాన లక్ష్యం మానవులు, పర్యావరణం మధ్య సంబంధాన్ని మెరుగుపరచడం. ఎంఏబీ కార్యక్రమం కింద గుర్తించిన ప్రాంతాలను బయోస్పియర్ రిజర్వ్స్ అని పిలుస్తారు.
బయోస్పియర్ రిజర్వ్
బయోస్పియర్ రిజర్వులు ప్రత్యేకమైన జీవావరణ వ్యవస్థలు. ఇక్కడ జీవవైవిధ్యాన్ని రక్షించడంతోపాటు సహజ వనరుల సుస్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తారు. బయోస్పియర్ రిజర్వులు మూడు ప్రధాన విభాగాలుగా విభజిస్తారు.
కోర్ ఏరియా: ఇక్కడ ఎలాంటి మానవ కార్యకలాపాలు అనుమతించరు.
బఫర్ జోన్: ఇక్కడ పరిశోధనలు, విద్య, పర్యాటకం వంటి కార్యకలాపాలు నిర్వహించవచ్చు.
ట్రాన్సిషన్ ఏరియా: ఇక్కడ మానవ నివాసాలు, సుస్థిర ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి.
మన దేశంలో గుర్తింపు పొందిన ప్రాంతాలు
దేశంలో మొత్తం 13 సంరక్షణ ప్రాంతాలు యునెస్కో జాబితాలో చేరాయి.
నీలగిరి బయోస్పియర్ రిజర్వ్: తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది.
నందాదేవి బయోస్పియర్ రిజర్వ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది.
నొక్రెక్ బయోస్పియర్ రిజర్వ్: మేఘాలయ రాష్ట్రంలో ఉంది.
గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్: తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది.
గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్: అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నది.
సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్: ఒడిశా రాష్ట్రంలో ఉన్నది.
పంచ్‌మర్హి బయోస్పియర్ రిజర్వ్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది.
అచానక్మార్ – అమర్ కంఠక్ బయోస్పియర్ రిజర్వ్: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది.
అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్: కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది.
గ్రేట్ రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్: గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది.
కాంచన్ జంగా బయోస్పియర్ రిజర్వ్: సిక్కిం రాష్ట్రంలో ఉన్నది.
శీతల ఎడారి జీవావరణం: హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలో ఉన్నది.
శీతల ఎడారి
శీతల ఎడారి అనేది వాతావరణం చాలా చల్లగా ఉండే ఒక రకమైన ఎడారి. ఇక్కడ చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎత్తయిన ప్రదేశాల్లో ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి.
యునెస్కో
యునెస్కో అనేది ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రత్యేక సంస్థ. విద్య, విజ్ఞానం, సంస్కృతి, సమాచార రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తోంది.