ఇండోర్: భారత్ లో మెజారిటీల మతోన్మాదం పెరిగితే ఈ దేశాన్ని కాపాడడం కష్టతరమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశంలో పెరుగుతున్న ఇస్లామోఫోబియా గురించి మాట్లాడారని అన్నారు. అక్కడ మెజారిటీలైన ముస్లింల వల్ల మైనారిటీలు ఇబ్బందిపడుతున్నారని చెప్పారన్నారు.
అయితే ముస్లింల అతివాదమే కాదు హిందువుల అతివాదం కూడా ప్రమాదకరమేనని దిగ్విజయ్ అన్నారు. భారత్ లోనూ మెజారిటీల మతోన్మాదం పెరిగితే.. దాని నుంచి ఈ దేశాన్ని కాపాడడం కష్టసాధ్యమైన పని అని అన్నారు.
గాంధీ వైపు ఉంటారా?.. గాడ్సే వైపా?
ఈ సభలో బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు దిగ్విజయ్. గాంధీజీని హత్య చేసిన సిద్ధాంతాలను అనుసరిస్తున్న వారే, తమ కార్యకర్తలను ప్రతి పంచాయతీలోనూ ఈ నెలంతా పాదయాత్ర చేయాలని చెబుతున్నారని అన్నారు. ఈ పాదయాత్ర ద్వారా వాళ్లేం చేయాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. గాంధీజీని వాళ్లు ఎలా ప్రొజెక్ట్ చేస్తారని ప్రశ్నించారాయన. వాళ్లు గాంధీజీ వైపు ఉంటారా, లేక ఆయన్ని హత్య చేసిన గాడ్సే వైపు ఉంటారా చెప్పాలన్నారు. ఎవరి సిద్ధాంతాలను ఆచరిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.


