- పదకొండు యూనివర్సిటీల్లో మొత్తం ఖాళీలు 2,125
- ఏడు వర్సిటీల్లో ప్రొఫెసర్లే లేరు.. ఆర్జీయూకేటీ, శాతవాహనలో అసోసియేట్లు కూడా నిల్
- గైడ్‌లైన్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ మరిచిన సర్కారు
- చివరిసారిగా 2013లో భర్తీ
- ప్రతీ మీటింగ్‌లోనూ ప్రొఫెసర్ల కొరతపై వీసీల ఆవేదన
- కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్న వర్సిటీలు.. అటకెక్కిన పరిశోధనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలు కేవలం డిగ్రీ పట్టాలు పంచే కేంద్రాలుగా మిగిలిపోతున్నాయి. ప్రొఫెసర్లు లేక వెలవెలబోతున్నాయి. మొత్తం 11 వర్సిటీల పరిధిలో 74 శాతం పోస్టులు ఖాళీగా ఉండడం అందోళన కలిగిస్తున్నది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఏడు యూనివర్సిటీల్లో ఒక్కరంటే ఒక్క ప్రొఫెసరూ లేకపోవడం పరిస్థితికి తీవ్రతను తెలుపుతున్నది. ఏండ్ల తరబడి నియామకాలు లేకపోవడంతో విద్యాబోధన కుంటుపడడంతో పాటు వర్సిటీల ప్రధాన లక్ష్యమైన ‘పరిశోధన’ పడకేసింది.
మరోవైపు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో న్యాక్ గ్రేడ్లు కష్టమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల డిగ్రీలకు సరైన గుర్తింపు లేకుండా పోతోంది. 2013లో అప్పటి ఉమ్మడి ఏపీలో చివరిసారిగా అసిస్టెంట్‌ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఖాళీల భర్తీని పట్టించుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు, వర్సిటీల్లో పోస్టుల భర్తీకి గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ భర్తీ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2,125 పోస్టులు ఖాళీ..
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,878 టీచింగ్ పోస్టులు ఉండగా.. కేవలం 753 మంది రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తున్నారు. మరో 2,125 పోస్టులు (74%) ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీల ఉనికికి ప్రొఫెసర్లే ఆధారం. పీహెచ్‌డీ స్కాలర్లకు గైడ్‌గా వ్యవహరించాలన్నా, నాణ్యమైన రీసెర్చ్ పేపర్లు సమర్పించాలన్నా, కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు రావాలన్నా ప్రొఫెసర్ల పాత్రే కీలకం.
కానీ, రాష్ట్రంలోని ఏడు ప్రధాన వర్సిటీలైన కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు, తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, బాసర ఆర్జీయూకేటీల్లో ఒక్కరంటే ఒక్క రెగ్యులర్ ప్రొఫెసర్ లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. గైడ్ చేసే ప్రొఫెసర్లు లేకపోవడంతో ఆయా వర్సిటీల్లో పరిశోధనలు పూర్తిగా అటకెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 393 ప్రొఫెసర్ పోస్టుల్లో 219 ఖాళీగానే ఉన్నాయి. ఉస్మానియా మినహా మిగిలిన వర్సిటీల్లో పరిశోధనలు నామమాత్రంగా మారాయి. సీనియర్ల పర్యవేక్షణ లేకపోవడంతో నామమాత్రపు పరిశోధనలే తప్ప నాణ్యమైన రీసెర్చ్ జరగడం లేదని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కింది స్థాయి పోస్టులూ ఖాళీనే..
కేవలం ప్రొఫెసర్లే కాదు, బోధనలో కీలకమైన అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ల విభాగంలో 913 పోస్టులకు గాను 792 ఖాళీలు ఉన్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ, శాతవాహన వర్సిటీల్లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ కూడా లేరు. మరోపక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత మరీ దారుణంగా ఉంది. 1,572 పోస్టులకు గాను.. 1,114 పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ప్రతిష్టాత్మకమైన ఓయూలో 470, కాకతీయలో 183 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వేల మంది విద్యార్థులున్న ఆర్జీయూకేటీలో 146 సాంక్షన్ పోస్టులు ఉంటే కేవలం 19 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలోనూ కొందరు సెలవుల్లో ఉండడం గమనార్హం. మరోపక్క పాలమూరు వర్సిటీలోనూ 136 పోస్టులకు 19మందే ఉన్నారు. తెలుగు వర్సిటీలో కేవలం 13 మంది, జేఎన్ఏఎఫ్ఏయూలో 14 మంది మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండడం గమనార్హం.
సర్కారు వద్దే ‘కొత్త’ నివేదిక
వర్సిటీ నియామకాల్లో పారదర్శకత, రోస్టర్ పాయింట్లు, పటిష్టమైన గైడ్‌లైన్స్ కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) గతంలోనే ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ స్టడీ చేసి నివేదిక సమర్పించింది. ఆ మేరకు ఏప్రిల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది. పోస్టులకు మూడు విధానాల్లో వెయిటేజీ మార్కులు ఇవ్వాలని ఆదేశించింది.
అకడమిక్ రికార్డు, రీసెర్చ్ పర్ఫామెన్స్ కు 50% మార్కులు, టీచింగ్ స్కిల్స్ కు 30 మార్కులు, ఇంటర్వ్యూలకు 20 మార్కులు కేటాయించారు. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేయడంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత మరోసారి విద్యాశాఖ ఉన్నతాధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపగా, ప్రస్తుతం అది సర్కారు వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
వీసీల ఆవేదన.. అరణ్య రోదన
మరోవైపు ఫ్యాకల్టీ లేక వర్సిటీలను నడపలేక వీసీలు సతమతమవుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్వహించే సమావేశంలోనూ వీసీలు ఖాళీల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా.. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోయారు. ప్రస్తుతం రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో కాంట్రాక్టు, పార్ట్ టైమ్, గెస్టు లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. అత్యధికంగా ఓయూలో 720 మంది, కేయూలో 417 మంది, జేఎన్టీయూలో 381 మంది పనిచేస్తున్నారు.
రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకుంటే న్యాక్ గ్రేడ్ కష్టమే..
వర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీలకు న్యాక్ గ్రేడింగ్ రావాలంటే బిల్డింగులు, స్టూడెంట్స్ ఉంటే సరిపోదు. రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాల్సిందే. న్యాక్ ఇచ్చే గ్రేడింగ్‌లో ‘టీచింగ్ -లెర్నింగ్’, ‘రీసెర్చ్’ విభాగాలకే భారీ వెయిటేజీ ఉంటుంది. కాలేజీలో మంజూరైన పోస్టులన్నీ రెగ్యులర్ స్టాఫ్‌తో నిండి ఉంటేనే ఈ కేటగిరీల్లో ఫుల్ మార్కులు పడతాయి.
కేవలం గెస్ట్, కాంట్రాక్ట్ లెక్చరర్లతో కొనసాగిస్తే ‘స్టూడెంట్-టీచర్ రేషియో’ దెబ్బతిని న్యాక్ బృందం మార్కుల్లో కోత విధిస్తుంది. పైగా పీహెచ్‌డీ, నెట్/సెట్ ఉన్న పర్మినెంట్ స్టాఫ్ లేకపోతే రీసెర్చ్ పేపర్లు, పబ్లికేషన్స్ ఉండవు. దీంతో యూనివర్సిటీలు, కాలేజీలకు ఏ++, ఏ+ లాంటి ఉత్తమ గ్రేడ్స్ రావడం కష్టం అవుతున్నది. రెగ్యులర్ నియామకాలు చేపట్టకుండా న్యాక్‌కు వెళ్తే చేతులు కాల్చుకున్నట్టేనని విద్యావేత్తలు చెప్తున్నారు.
చివరిసారిగా 2013లో భర్తీ..
ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2013లో వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో ఓయూలోనే 220 వరకూ పోస్టులను నింపారు. ఆ తర్వాత కొత్త పోస్టులను భర్తీ చేయలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కారు 2018లో 1,061 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందుకోసం అప్పటి గవర్నర్.. రాష్ట్రపతి అనుమతి కోసం పంపారు. దీంతో అది పెండింగ్‌లో పడిపోయింది. ఆ తర్వాత ఖాళీల భర్తీని బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ వర్సిటీల వారీగానే భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈమేరకు ఖాళీల వివరాలను సేకరించినా, అడుగు ముందరపడలేదు.
సర్కార్ వచ్చి రెండేండ్లయినా భర్తీ లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో వర్సిటీ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రెండేండ్లవుతున్నా ఆ హామీ అమలు కాలే. గైడ్‌లైన్స్ ఇచ్చినా పోస్టులను మాత్రం నింపడం లేదు. పీహెచ్‌డీ చేసే స్టూడెంట్లకు గైడ్‌షిప్ ఇచ్చేవారు కూడా కరువయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలె.
టి. నాగరాజు, ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ
75 శాతం ఖాళీలే..
వర్సిటీల్లో ప్రొఫెసర్లు లేక విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. వర్సిటీల్లో 75 శాతానికి పైగా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఓయూలోనే 1,296 పోస్టులకు గాను కేవలం 312 మందే పని చేస్తున్నారు. సెంట్రల్ వర్సిటీల్లో రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ జరుగుతుంటే.. మన దగ్గర మాత్రం ఆ ఊసే లేదు. వెంటనే టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలను నింపాలె.
పృథ్వీ తేజ, ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ
