న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ధర్మేంద్ర ప్రధాన్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం విద్యార్థుల సంక్షేమానికి నిదర్శనమని కొనియాడింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రజా జీవితం, విద్యార్థుల సంక్షేమంతో జీవితకాల అనుబంధానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.
భారతదేశ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఆయన చిత్తశుద్ధితో పని చేశారని పేర్కొన్నారు.
విద్యాశాఖ వంటి కీలకమైన విభాగానికి నాయకత్వం వహించడానికి అపారమైన పట్టుదల అవసరమని.. ఆయన దానిని ఎంతో ధైర్యంతో, స్పష్టమైన దార్శనికతతో స్వీకరించారని ప్రశంసించారు. దేశం కోసం ప్రధాన్ చేసిన అవిశ్రాంత సేవకు, సంస్కరణల పట్ల ఆయనకున్న నిబద్ధతకు, బలమైన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇదే దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో మీరు దేశానికి సేవ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా:
నీట్ పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసనకు మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు.
మరోవైపు.. ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జులై 20న కాక్రోచ్ పార్టీ పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్) కార్యక్రమం చేపట్టింది. ఈ చలో పార్లమెంట్ కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. సీజేపీ నిరసనకారులపై పోలీసులు దమనకాండ కొనసాగించారు. విద్యార్థులపై విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. పోలీసుల దాడిలో పదుల సంఖ్యలో నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిరసనకారులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా పార్లమెంట్‌ను స్తంభింపజేశాయి ప్రతిపక్షాలు. ఓ వైపు సీజేపీ.. మరోవైపు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తడి నెలకొంది. దీంతో చేసేదేమి లేక సీజేపీ, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
