
రాబోయే ఎన్నికల కోసం అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే తమ లక్ష్యం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లతో వీరు భేటీ అయ్యారు. ఈ భేటీ చారిత్రాత్మకమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. దేశంలోని వ్యవస్థలపై జరుగుతున్న అక్రమాలను ఎదురుకునేందుకు వీలైనన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తామని రాహుల్ తెలిపారు.
సాధ్యమైనన్ని పార్టీలను సమైక్యపరచి, కలిసికట్టుగా పని చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లుగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు కార్యచరణపై నేతలు చర్చించుకున్నారు. బీజేపీపై ఐకమత్యంగా పోరాడే అవకాశాలపై చర్చించారు. ఖర్గే అంతకుముందు డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేలతో కూడా మాట్లాడారు.