తెలంగాణ యోధుల చర్రితను పాఠ్యాంశాలుగా చేర్చాలి

తెలంగాణ యోధుల చర్రితను పాఠ్యాంశాలుగా చేర్చాలి
  • భూదాన, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల వారసుల విజ్ఞప్తి

బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ భూదాన, రైతాంగ సాయుధ పోరాట యోధుల చరిత్ర భావితరాలకు తెలియజేసేలా వారి స్మారకాన్ని, విగ్రహాలను ఏర్పాటు చేయాలని,  సిటీలో రెండు ఎకరాల భూమిని కేటాయించాలని,  యోధుల చర్రితను పాఠ్యపుస్తకాలలో పొందుపర్చాలని పలువురు వక్తలు కోరారు. ప్రస్తుతం కొందరు పాలకులు, రాజకీయ పార్టీల నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సాయుధ పోరాట యోధులను ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీభూదాన్ రామచంద్రారెడ్డి మెమోరియల్ ట్రస్ట్, ఆలిండియా సర్వసేవా సంఘ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ‘తెలంగాణ పరోపకారులు, వీరులు, వీరవనితల సంస్మరణ, వారి వారసుల సన్మానసభ’ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. 

ఆలిండియా సర్వసేవా సంఘ్ జాతీయ ట్రస్టీ, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు తోలుపునూరి కృష్ణగౌడ్ అధ్యక్షత వహించారు. మగ్ధూంమోహియుద్దీన్ కుమారుడు జాఫర్ మోహియుద్ధీన్, చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం, ఆరుట్ల కమలాదేవి మనుమడు ఆరుట్ల శ్రీకాంత్ రెడ్డి, భీం రెడ్డి నరసింహారెడ్డి కుమారుడు ప్రభాకర్ రెడ్డి తదితరులను ఆలిండియా సర్వసేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడు, శ్రీభూదాన్ రామచంద్రా రెడ్డి మెమోరియల్ సంస్థ ట్రస్టీ వెదిరె అరవింద్ రెడ్డి ఘనంగా సన్మానించారు. 

అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. భూదాన్ రామచంద్రా రెడ్డి, రావి నారాయణ రెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల కమలా దేవి, మగ్ధూంమోహియుద్దీన్, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, సురవరం ప్రతాప్ రెడ్డి తదితర పోరాటయోధుల వారసులతో ఒక ఫోరంను ఏర్పాటు చేసి తెలంగాణ సాయుధ పోరాటయోధుల చరిత్రను భావి తరాలకు అందించేందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. 

పోరాటయోధుల చరిత్రను పొందుపరుస్తూ సమగ్ర పుస్తకాన్ని ప్రచురించనున్నట్లు వెల్లడించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆరుట్ల శ్రీకాంత్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్రచారి, దత్రపు చందులాల్ పటేల్, అనిగంటి దిలీప్ నేత, తొలుపునూరి నరేశ్, చిట్యాల శ్వేత తదితరులు పాల్గొన్నారు.