హైదరాబాద్ లో డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఫౌండేషన్ కమిటీ ఆధ్వర్యంలో లిబర్టీలోని విగ్రహం వద్ద 55 వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ వర్థంతి వేడుకలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, లోకసత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ, వారితోపాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.... బూర్గుల రామకృష్ణారావు 55వ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల అన్న దత్తాత్రేయ.. బూర్గుల రామకృష్ణారావు గొప్ప దేశభక్తుడని చెప్పారు. బూర్గుల నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకించిన నేత అని, ఎన్నో భూసంస్కరణలు చేపట్టారని చెప్పుకొచ్చారు. కౌలు చట్టాలను, చిన్న రైతులకు, పేద రైతుల కల్పించిన నేత అన్న ఆయన... పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవం అధికారికంగా జరపడం ఎంతో సంతోషంగా ఉందని, గత ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవానికి ఒప్పుకోలేదని ఆరోపించారు. 1998 నుండి 2022 వరకు అన్ని పార్టీలు విమోచన దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన యోధుల చరిత్రను తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో ముద్రించాలని దత్తాత్రేయ కోరారు.
బూర్గుల గానీ, ఆయన కుటుంబం గానీ ఎప్పుడూ రాజకీయ లబ్ధి కోసం ఆలోచించలేదు..
ఈ కార్యక్రమంలో లోకసత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ... బూర్గుల రామకృష్ణ గారు జాగిర్దారి కుటుంబంలో పుట్టాడని... బూర్గుల రామకృష్ణకు నైజాం పరిపాలనలో ఎన్ని అధికారులు ఉన్నా స్వాతంత్ర భారతదేశంలో హైదరాబాద్ ను విలీనం చేయాలని కోరిన నేత అని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని రామకృష్ణ చిరునవ్వుతో వదిలిపెట్టిన గొప్ప నేత అని కొనియాడారు. బూర్గుల గానీ, ఆయన కుటుంబం గానీ ఎప్పుడూ రాజకీయంగా లబ్ధి కోసం ఆలోచించలేదని చెప్పారు. ఈనాడు కోట్ల డబ్బుంటే అక్రమంగా సక్రమంగా సంపాదించిన డబ్బు ఉంటే ఎమ్మెల్యే, ఎంపీ, పదవులను ఆశించే రోజులు ఇవి అని, బూర్గుల లాంటి నేతలు మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశానికి నాయకత్వం ఇచ్చారంటే నమ్మలేకపోతున్నామన్నారు. సమాజానికి సేవలందించే నేతలను ఎన్నుకోవాలి కానీ వారసత్వాన్ని పెంచి పోషించే వాళ్లను కాదని చెప్పారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో ఈ దేశంలో 520 పైగా సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయన్న జయప్రకాష్ నారాయణ... ఇటలీ రాజ్యాంగం ఏర్పడడానికి 23 ఏళ్లు పోరాటం చేశారన్నారు. హైదరాబాద్ దేశంలో విలీనం కావడానికి అప్పటి పోలీస్ కాల్పుల్లో కేవలం ఆరుగురు మాత్రమే చనిపోయారని, హింస, రక్తపాతం లేకుండా 565 సంస్థానాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో విలినం చేశాడని చెప్పారు. సెప్టెంబర్ 17న విలీనమైన హైదరాబాదు రాష్ట్రం.. విస్తీర్ణం, జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. సెప్టెంబర్ 17 జాతీయ ఐక్యతకు, సంస్కృతికి, సమగ్రతకి, సంకేతమని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17నాడు అన్ని పార్టీలు కలిసి ఉత్సవాలు జరుపుకోవాలని లేకుంటే పొరపాటు అవుతుందన్నారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు పోవాలన్న ఆయన... ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందాలని కోరారు. స్వాతంత్ర్యం గురించి పోరాటం చేసి అమరులైన యోధులకు ప్రతి ఒక్కరికి జయప్రకాష్ నారాయణ నివాళులు అర్పించారు.
