ఢిల్లీలో మరో దారుణం

ఢిల్లీలో మరో దారుణం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో హిట్​అండ్ రన్ ఘటన జరిగింది. వీఐపీ జోన్​లోని ఉండే కస్తూర్బా మార్గ్​లో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి కస్తూర్బా మార్గ్​లోని టోల్ స్తోయి రోడ్డులో దీపాన్షు వర్మ (30) అతని కజిన్ ​ముకుల్(20) బైక్​పై వెళ్తుండగా ఓ కారు(ఎస్​యూవీ) బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముకుల్ ఎగిరి దూరంగా పడిపోగా.. దీపాన్షు వర్మ కారు రూఫ్​పై పడ్డాడు.

టాప్​పై ఓ వ్యక్తి పడ్డాడని అక్కడున్న వాళ్లు అరుస్తూ కారును ఆపేందుకు ప్రయత్నించినా కూడా అతను బ్రేక్ వేయకుండా స్పీడ్​గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మూడు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఢిల్లీ గేట్ సమీపంలో కారును ఆపి రూఫ్ పైనున్న దీపాన్షు వర్మను కింద పడేసి వెళ్లిపోయాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన అతను అక్కడే మృతిచెందాడు. కారు ఢీకొన్నప్పుడు ఎగిరి దూరంగా పడ్డ ముకుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.. అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

మహమ్మద్ బిలాల్ అనే వ్యక్తి ఈ ప్రమాద ఘటనను మొత్తం వీడియో తీసి పోలీసులకు ఇచ్చాడు. ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడు దీపాన్షు వర్మ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం.. అతను జువెలరీ షాప్‌‌‌‌‌‌‌‌ నడుపుతున్నాడు. కొన్ని నెలల క్రితం ఢిల్లీలో ఇలాగే ఓ కారు ఒక యువతిని ఢీకొట్టి కొన్ని కిలోమీటర్ల దూరం ఇడ్చుకెళ్లింది. ఆ ఘటనలో యువతి అత్యంతదారుణంగా గాయపడి చనిపోయింది.