బుద్వేల్, మోకిలలో హెచ్ఎండీఏ లేఅవుట్లు

బుద్వేల్, మోకిలలో హెచ్ఎండీఏ లేఅవుట్లు
  •     రూ.400కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయం
  •     గత బీఆర్ఎస్​ హయాంలో భూముల వేలంతో రూ.కోట్ల ఆదాయం
  •     లేఅవుట్లు డెవలప్​ చేయకుండా ఇతర అవసరాలకు వాడిన వైనం
  •     కొనుగోలుదారుల నుంచి ఒత్తిడి.. టెండర్లు పిలిచిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: ఔటర్​రింగ్​రోడ్​సమీపంలోని బుద్వేల్, మోకిలలో లేఅవుట్లు అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. రూ.400 కోట్లతో వసతుల కల్పనకు టెండర్లు పిలిచింది. గత బీఆర్ఎస్​ప్రభుత్వం ఈ రెండు చోట్ల భూములను వేలం వేసి వదిలేసింది. లేఅవుట్లను అభివృద్ధి చేయలేదు. వచ్చిన ఆదాయాన్ని ఇతర అవసరాలకు మళ్లించింది. బీఆర్ఎస్​దిగిపోయి, కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక కొనుగోలుదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించారు. ఇటీవల లేఅవుట్ల అభివృద్ధికి టెండర్లు పిలిచారు.

 దాదాపు ఏడాదిన్నర కింద అప్పటి బీఆర్ఎస్​ప్రభుత్వం బుద్వేల్​లోని 180 ఎకరాలను వేలం వేసింది. ఓ వైపు ఓఆర్ఆర్, మరోవైపు హిమాయత్ సాగర్ ఉండడంతో ఈ భూములకు భారీ డిమాండ్​ఏర్పడింది. రాజేంద్రనగర్, శంషాబాద్​ఎయిర్​పోర్టుకు మధ్యలో ఉండడం, చుట్టూ విల్లాలు, ఐటీ కారిడార్లు ఉండడంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆఫీసులు ఆనుకుని ఉండడంతో అనేక కంపెనీలు బుద్వేల్ భూములను కొనుగోలు చేశాయి. అలాగే పటాన్​చెరు సమీపంలోని మోకిలలోనూ గత ప్రభుత్వం 165 ఎకరాల భూములను ప్లాట్లుగా చేసి, వేలం వేసింది.

 ఇక్కడ గజం రూ.లక్ష వరకు ధర పలికినట్లు అధికారులు తెలిపారు. మోకిల భూములు ఓఆర్ఆర్ కు ఆనుకుని ఉండడంతో డిమాండ్ పెరిగింది. మొత్తంగా బుద్వేల్, మోకిల భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.2వేల కోట్లకు పైనే ఆదాయం సమకూరింది. అయితే ఈ మొత్తాన్ని గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో హెచ్ఎండీఏ ఖజానా నిండుకుంది. 

పెద్ద ఎత్తున భూ వేలం

గత సర్కార్ సిటీ పరిధిలోని ఏ ఒక్క ప్రభుత్వ భూమిని వదల్లేదు. ఖాళీ జాగా కనిపిస్తే.. వెంటనే వేలం వేసే ప్రయత్నం చేసింది.  వచ్చిన ఆదాయాన్ని ఇతర అవసరాలకు వినియోగించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వేలం వేయడమే పనిగా పెట్టుకుంది. రాజేంద్రనగర్ పరిధి బుద్వేల్, పటాన్​చెరు సమీపంలోని మోకిలలో పెద్ద ఎత్తున భూములు వేలం వేసింది. వచ్చిన ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు మళ్లించింది. లేఅవుట్ల అభివృద్ధి, ఇతర వసతుల కల్పనను గాలికొదిలేసింది.

 ఆయా ప్రాంతాల్లో భూములు కొన్నవారు.. వసతులు కల్పించాలంటూ హెచ్ఎండీఏపై ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం వేలం తర్వాత 18 నెలలలోపే భూములను అభివృద్ధి చేయాలి. రోడ్లు, పార్కులు, ఇతర వసతులు కల్పించాలి. కానీ గత ప్రభుత్వం వేలంతో వచ్చిన ఆదాయంపై దృష్టి పెట్టిందే కానీ, అభివృద్ధిని పట్టించుకోలేదు. ప్రస్తుతం కనీసం లేఅవుట్లు అభివృద్ధి చేద్దామన్నా నిధుల కొరత వేధిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ముందు కోకాపేట భూములు వేలం వేసిన గత ప్రభుత్వం, ఆ వెంటనే రూ.500 కోట్లతో డెవలప్ చేసింది. మరి బుద్వేల్, మోకిల భూములపై ఎందుకు నిర్లక్ష్యం వహించిందని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు.