
హైదరాబాద్‌సిటీ, వెలుగు: నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న హెచ్ఎండీఏ.. ఆదాయం సమకూరే వనరులున్నా సద్వినియోగం చేసుకోవడం లేదు. నిధులు లేకపోవడంతో రూ.కోట్ల ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. ఆదాయం సమకూర్చుకునేందుకు ఇటీవల భూముల వేలం వేసినా పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఆదాయానికి ప్రత్యామ్నాయ మార్గాలున్నా హెచ్ఎండీఏ పట్టించుకోవడం లేదు. బుద్ధి పూర్ణిమ ప్రాజెక్టు కింద ట్యాంక్బండ్పరిసరాలను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది.
నిత్యం వేలాదిగా తరలివచ్చే సందర్శకులతో ఈ ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా పండగలు, సెలవు దినాల్లో అయితే ఇసుకపోస్తే రాలనంత జనం వస్తుంటారు. దీంతో ఈ ప్రాంతాల్లో రోజూ రూ.కోట్ల వ్యాపారాలు జరుగుతున్నాయి. హెచ్ఎండీఏకు ఐమాక్స్, ఎన్టీఆర్గార్డెన్స్, లుంబినీ పార్క్, సంజీవయ్య పార్క్, అంబేద్కర్స్టాచ్యూ సమీపంలో, పీపుల్స్ ప్లాజా ఎదురుగా భూములున్నాయి. కొన్ని నెలల క్రితం వరకూ ఈ స్థలాలను పార్కింగ్, షాపుల కోసం లీజుకిచ్చారు.
వీటి ద్వారా నెలకు రూ.15 కోట్లు ఆదాయం వచ్చేది. కానీ, కొందరు లీజుదారులు బకాయిలు చెల్లించకపోవడంతో లీజు రద్దు చేశారు. అప్పటి నుంచి ఈ స్థలాలను కొందరు ఆఫీసర్లు నచ్చిన వారికి అద్దెకు ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. షాపులు పెట్టుకున్న వారు సదరు ఆఫీసర్లను సంతృప్తి పరిచి రెంట్కట్టకుండానే షాపులు, ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేసుకుని దండుకుంటున్నట్టు సమాచారం.
ఎందుకు నిర్లక్ష్యం..!
హెచ్ఎండీఏ ఖాళీ స్థలాల్లో పార్కింగ్, షాపులు ఏర్పాటు చేసుకునేందుకు టెండర్లను పిలిచి కేటాయించేది. ప్రస్తుతం ఈ స్థలాలు ఖాళీగా ఉంటున్నా అధికారులు టెండర్లు పిలవడం లేదు. దీంతో ఐమాక్స్పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ప్రైవేట్వాహనాలు పార్క్చేస్తున్నారు. ఎన్టీఆర్గార్డెన్స్, లుంబినీ పార్కుల వద్ద కూడా హెచ్ఎండీఏ స్థలాల్లో ప్రైవేట్‌వ్యక్తులు అక్రమంగా వ్యాపారాలు, ఫుడ్‌కోర్టులు నిర్వహించుకుంటున్నారు.
పీపుల్స్‌ప్లాజా ఎదురుగా ఉన్న ఖరీదైన స్థలంలోనూ కొందరు ప్రైవేట్‌వ్యక్తులు పార్కింగ్‌కోసం వాడుకుంటున్నారు. వీటిని టెండర్ల ద్వారా లీజుకు ఇస్తే రూ.కోట్లలో ఆదాయం వస్తుంది. కానీ, అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు అధికారులు ఆయా ప్రాంతాల్లో షాపులను పెట్టుకునేందుకు అనుమతించి అద్దెలు వసూలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.