ఒక్కరోజు మినహా వరుసగా సెలవులు.. ఓటేస్తారా.. టూరెళ్తారా ?

ఒక్కరోజు మినహా వరుసగా సెలవులు..  ఓటేస్తారా.. టూరెళ్తారా ?
  •     ఈ నెల30న పోలింగ్​లీవ్
  •     శుక్రవారం తప్ప శని, ఆది వీకెండ్స్ 
  •     ఓటేసేందుకు ఆసక్తి చూపని ఐటీ ఎంప్లాయీస్
  •     సిటీలో పోలింగ్ శాతం పెంపుపై అధికారులు ఫోకస్ 
  •     గత ఎన్నికల్లోనూ 50 శాతంలోపే నమోదు 
  •     అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడంలేదు

హైదరాబాద్, వెలుగు :  ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిటీలో పోలింగ్ శాతంపైనే అధికారులు దృష్టి పెట్టారు. ఈసారి పోలింగ్ నవంబర్ 30న గురువారం వచ్చింది. దీంతో పోలింగ్ పర్సంటేజ్ పెరగవచ్చని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఐటీ ఎంప్లాయీస్ ఎంత మంది ఓటేస్తారనేది ఆసక్తిగా మారింది.  పోలింగ్​సందర్భంగా గురువారం అధికారికంగా లీవ్​ఇచ్చారు. ఆ తర్వాత రోజు శుక్రవారం మినహాయిస్తే శని, ఆదివారాలు సాఫ్ట్‌‌వేర్ ఎంప్లాయీస్ కు వీకెండ్స్.  అంటే.. శుక్రవారం లీవ్​పెట్టుకుంటే వరుసగా నాలుగురోజులు కలిసివస్తాయి. దీంతో టూర్ ప్లాన్ చేసుకునే వీలుంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగులకు కూడా శని, ఆదివారాలు సెలవులు. కాగా.. వీరు కూడా ఓటింగ్ కు దూరంగా ఉండే చాన్స్ ఉండొచ్చని తెలుస్తుంది. 

40 శాతం మంది ఐటీ ఎంప్లాయీస్ ఉండగా.. 

ఏ ఎన్నికైనా.. సిటీలో పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా నమోదవుతుంది. ఐటీ కారిడార్ లో సుమారుగా 7 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటారు. చాలా మందికి ఇక్కడ ఓటు హక్కు లేదు. 30 నుంచి 40 శాతం మంది సొంతూళ్లలోనే ఓటు హక్కు ఉందని చెబుతుంటారు. ఐటీ ఉద్యోగాల్లో 25 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారైతే, 75 శాతం తెలుగు రాష్ట్రాలవారే నివసిస్తుంటారు. ఇందులో హైదరాబాద్​లో పుట్టి పెరిగిన, స్థిరపడిన వారు 40 శాతం ఉంటారు. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా వీరిలో 10 శాతం మంది  కూడా ఓటు వేయడంలేదు. దీంతో సిటీ అంతటా చూస్తే ఐటీ కారిడార్ లోనే తక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది. ఈసారైనా వేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుంది. లేకపోతే ఎప్పటిలానే తక్కువగా నమోదయ్యేలా ఉంది. జీహెచ్ఎంసీ, అసెంబ్లీ, ఎంపీ ఇలా ఏ ఎన్నికైనా.. సిటీలో బస్తీల్లో మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ తక్కువగానే నమోదవుతుంది. 

ఓటు వేసేందుకే హాలిడేనా..

పోలింగ్‌‌ డే అంటే హాలీడేనా ? ప్రతిసారి ఎన్నికల్లో తగ్గుతున్న పోలింగ్‌‌ శాతం ఏం చెబుతుంది? అసలు సిటీ ఓటర్లు ఏమనుకుంటున్నారు? హైదరాబాద్‌‌లో పోలింగ్‌‌ శాతం ఎన్నికలకెన్నికలకూ మారుతుంది. టెక్నాలజీ కాలంలో బిజీగా ఉండడంతోనే పోలింగ్‌‌ను లైట్‌‌ తీసుకున్నట్టు కనపడుతుంది. పోలింగ్‌‌ డేను లీవ్ గా చూస్తుండగా.. సిటీ ఓటర్లు పోలింగ్​రోజు నుంచి వరుస సెలవులు వచ్చాయంటే ఇక అంతే.! 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే జరిగింది. పోలింగ్ డే ను సెలవుగా భావిస్తున్న వారు టూర్లకు వెళ్తూ ఓటు వేయడాన్ని విస్మరిస్తున్నారు. పోలింగ్​రోజున ఓటు హక్కును వినియోగించుకునేందుకే సెలవు రోజును ప్రకటిస్తారు. కానీ దాన్ని ఎంజాయ్ మెంట్ కోసం వాడుకుంటున్నారు.

ఏ ఎన్నికైనా అదే తీరు..

సిటీలో ఓటింగ్​శాతం పెంచేందుకు ఓటర్లలో చైతన్యం కల్పించామని అధికారులు చెబుతున్నప్పటికీ  ఫలితం కనిపించడంలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  50 శాతంలోపే నమోదైంది. 2020 లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.71  శాతం నమోదైంది.  ప్రధానంగా బస్తీల జనాలే ఓటేసేందుకు ముందుకొస్తుండగా, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్​ వంటి కొన్ని ప్రాంతాల్లో నివసించే వారు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడంలేదు.