ఈశ్వరయ్య ఎందరికో ఆదర్శం

ఈశ్వరయ్య ఎందరికో ఆదర్శం

హైదరాబాద్: ప్రార్ధించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న.  అనే సూక్తికి నిదర్శనం ఈశ్వరయ్య. పేదలకు, అనాదలకు సాయం చేసే గొప్ప వ్యక్తి. మహేశ్వరం జిల్లా పెండ్యాల గ్రామంలో పుట్టారు ఈశ్వరయ్య. తల్లిదండ్రులు కూలీ పనులు చేసేవారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా... చదువు ఆపకూడదనుకున్నారు. పట్టుదలతో 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు ఊర్లో గేదెలను కాస్తూ.. బట్టలు కుట్టే పని చేశాడు. ఖాళీ సమయంలో ఈతకు వెళ్ళేవారు ఈశ్వరయ్య. పోలీస్ అవ్వాలనే లక్ష్యంతో  ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే కోరికతో.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని 2000 వ సంవత్సరంలో హోంగార్డుగా ఉద్యోగం సాధించారు ఈశ్వరయ్య. ట్రైనింగ్ టైమ్ లో రాజేంద్రనగర్ లో ఏడాది పాటు పనిచేశారు. ఆ తర్వాత మహేశ్వరంకు ట్రాన్స్ ఫర్ అయ్యారు.  ఆపదలో ఉన్న వారికి.. చదువుకునే పిల్లలకు ఎగ్జామ్ ఫీజులు కట్టేవారు. ఎక్కడ విధులు నిర్వహించినా పేదవారు, ఆకలితో అలమటించే వారికి సాయం చేసేవారు. ఆ తర్వాత కందుకూరు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. అక్కడి నుంచి  సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ ఫర్ అయ్యారు.

సరూర్ నగర్ లేక్ ఔట్ పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం నిర్వహిస్తూ.. వివిధ కారణాలతో చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన 19 మందిని కాపాడారు ఈశ్వరయ్య. గతేడాది సూసైడ్ కు యత్నించిన ఐదుగురిని కాపాడారు. సమస్యలను ధైర్యంగా ఎదిరించాలని... ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఈశ్వరయ్య సేవలను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు... ఆయనకు ప్రధాన మంత్రి లైఫ్ సేవింగ్ అవార్డు కోసం సిఫార్సు చేశారు. కుటుంబ సభ్యులు, అధికారుల సపోర్ట్ తో.. తాను అనుకున్న స్ధాయిలో ఉన్నానని చెబుతున్నారు ఈశ్వరయ్య.  ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు... చేతనైనంత సాయం చేస్తున్న ఈశ్వరయ్య ఎందరికో ఆదర్శం.