ఆంత్రోపిక్ కొత్త ఏఐ టూల్: ఏఐ Vs సైబర్ సెక్యూరిటీ కంపెనీలు.. యుద్ధం మొదలైంది..?

ఆంత్రోపిక్ కొత్త ఏఐ టూల్: ఏఐ Vs సైబర్ సెక్యూరిటీ కంపెనీలు.. యుద్ధం మొదలైంది..?

ప్రపంచ వ్యాప్తంగా ఏఐ రోజుకో అద్భుతాన్ని సృష్టిస్తోంది. అయితే ఈ ఆవిష్కరణలు కొన్నిసార్లు మార్కెట్‌ను భయపెడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఏఐ సంస్థ ఆంత్రోపిక్ విడుదల చేసిన ఒక కొత్త సెక్యూరిటీ టూల్.. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ మార్కెట్‌లో పెను భూకంపాన్నే సృష్టించింది. ఏఐ వల్ల కొత్త భయం మొదలైందనే సంకేతాలను ఇస్తూ.. స్టాక్ మార్కెట్‌లో సైబర్ సెక్యూరిటీ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. కంపెనీ విడుదల చేసిన ఆ టూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

అసలు ఆ టూల్ ఏం చేస్తుంది..?
ఆంత్రోపిక్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ పేరు 'క్లాడ్ కోడ్ సెక్యూరిటీ'. ఇది సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఉన్న లోపాలను ఆటోమేటిక్‌గా గుర్తించడమే కాకుండా.. వాటిని ఎలా సరిచేయాలో కూడా సూచిస్తుంది. సాధారణంగా ఒక సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ లోపాలను వెతకడానికి, వాటిని ఫిక్స్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఈ ఏఐ టూల్ మనిషులు ఆలోచించినట్లే కోడ్‌ను విశ్లేషించి.. నిమిషాల్లో పరిష్కారాలను చూపుతోంది. సాంప్రదాయ పద్ధతుల్లో దొరకని క్లిష్టమైన బగ్స్‌ను కూడా ఇది ఇట్టే పట్టేస్తుందని సంస్థ చెబుతోంది. దీంతో టెక్కీల్లో కెరీర్ భయాలు స్టార్ట్ అయ్యాయి. 

షేర్ మార్కెట్‌లో ప్రకంపనలు..
ఆంత్రోపిక్ ప్రకటన రాగానే ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవిష్యత్తులో ఈ ఏఐ టూల్స్ వల్ల సాంప్రదాయ సైబర్ సెక్యూరిటీ కంపెనీల అవసరం తగ్గుతుందేమో అన్న ఆందోళనతో షేర్లను భారీగా అమ్మేశారు. దీని ప్రభావంతో టెక్ స్టాక్స్ షేక్ అయ్యాయి. ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 

* JFrog షేర్లు ఏకంగా 24% పడిపోయాయి.
* ప్రముఖ సంస్థ CrowdStrike దాదాపు 8% నష్టపోయింది.
* Okta 9%, GitLab 8% పైగా నష్టాలను చవిచూశాయి.
* వీటితో పాటు Zscaler, Palo Alto Networks వంటి దిగ్గజ సంస్థల షేర్లు కూడా పడిపోయాయి.

ఏఐతో పెరుగుతున్న సవాళ్లు..
ఒకప్పుడు ఏఐని కేవలం సహాయకారిగా చూసిన కంపెనీలు.. ఇప్పుడు అది తమ వ్యాపారాలకే పోటీగా మారుతుండటంతో ఆందోళన చెందుతున్నాయి. ఒకవైపు సైబర్ నేరగాళ్లు ఏఐని ఉపయోగించి దాడులు చేస్తుంటే.. మరోవైపు ఆ రక్షణ బాధ్యతను కూడా ఏఐయే తీసుకోవటం సంచలనంగా మారింది. దీంతో సాధారణ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లకు విలువుంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఈ టూల్ పరిమితంగా అందుబాటులో ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఇది పూర్తిస్థాయిలో వస్తే సైబర్ సెక్యూరిటీ రంగం స్వరూపమే మారిపోనుంది. ఏఐ ఖచ్చితంగా ఉపాధి అవకాశాలను మాయం చేస్తుందనే భయాలు నిజమే అనేలా చేస్తోంది దాని అభివృద్ధిలో కనిపిస్తున్న వేగం చూస్తుంటే.