తాకట్టు రాజకీయం నడుస్తోంది : కాంగ్రెస్​ చీఫ్​ రేవంత్‌రెడ్డి

తాకట్టు రాజకీయం నడుస్తోంది : కాంగ్రెస్​ చీఫ్​ రేవంత్‌రెడ్డి

చౌటుప్పల్ వెలుగు : ‘ఢిల్లీ లీడర్లు వచ్చినా, గజ్వేల్‌ తాగుబోతు వచ్చినా.. మునుగోడు ప్రజల ముందు బలాదూర్‌’ అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, దేవలమ్మ నాగారం, పీపల్‌పహాడ్‌లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రాష్ట్రంలో తాకట్టు రాజకీయం నడుస్తోంది, అక్కడక్కడా అమ్ముడుపోయే లీడర్లు మోపైన్రు, పంచాయతీ ఓట్లను స్థానిక సంస్థల నాయకులు, మునుగోడు నియోజవర్గ ఓట్లను అమిత్‌షాకు తాకట్టు పెట్టారు, సంతలో పశువుల కంటే హీనంగా అమ్ముడుపోతున్న లీడర్ల వెంట వెళ్లడానికి ప్రజలు సిద్ధంగా లేరు’ అని అన్నారు. మునుగోడులో 12 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా మహిళ.. ఎమ్మెల్యే కాలేదని అన్నారు. మహిళలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరారు. మునుగోడు ఉపఎన్నిక అమ్ముడుపోయినందుకే వచ్చిందని, ఉప ఎన్నికలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. అమ్ముడుపోయిన వారికి డబ్బులు వచ్చాయి తప్ప, నియోజకవర్గానికి నిధులు రాలేదన్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌లో ఉండి కొట్లాడితే నిధులు వస్తాయి కానీ ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీలోకి వెళ్తే నిధులెలా వస్తాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ ఏమిచ్చినా తీసుకొని, ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయాలని కోరారు. 2014లో కూసుకుంట్ల, 2018లో పాల్‌ను (కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి) గెలిపిస్తే వారు నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్‌ పాల్వాయి స్రవంతిని  గెలిపిస్తే కిష్టరాయన్‌పల్లి, చర్లగూడెం నిర్వాసితులు, పోడు భూముల విషయంలో అసెంబ్లీలో కొట్లాడుతుందన్నారు. ఒక మహిళను ఓడించేందుకు కేసీఆర్‌, కేటీఆర్, హరీశ్​రావు ఒక్కో ఊరు పంచుకున్నారని, అదేవిధంగా ఢిల్లీ నుంచి పెద్దపెద్దోళ్లు దిగారన్నారు. ప్రచారంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నాయకులు పల్లె రవికుమార్‌గౌడ్‌, చలమల కృష్ణారెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, పున్న కైలాశ్‌ నేత పాల్గొన్నారు.

మునుగోడులో టీఆర్ఎస్ కు మా మద్దతు లేదు

గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ 

ఖైరతాబాద్, వెలుగు: ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తమ మద్దతు లేదని గౌడ్ అఫీషియల్స్​ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మద్దెల రమేశ్​బాబు స్పష్టం చేశారు. కొంతమంది నాయకులు గౌడ సంఘాల పేరుతో టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు అని ప్రకటించుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదివారం హైదరాబాద్​ సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మాట్లాడుతూ మునుగోడులో అత్యధిక శాతం ఓట్లున్న గౌడ్స్​కు టీఆర్​ఎస్ ​టికెట్ ​ఇస్తుందని ఆశిస్తే..తమను మోసం చేసిందన్నారు. గౌడ్స్​కు ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదని, అగ్ర కుల దురంహకార భావాలున్న రాజకీయ పార్టీలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. రామారావు గౌడ్, మిరయ్య, మొగిలి గౌడ్ పాల్గొన్నారు.