డిజిటల్ మీడియాకూ గుర్తింపు.. ఇకపై రిపోర్టర్లకు, డెస్క్ జర్నలిస్టులకు వేర్వేరు కార్డులు

డిజిటల్ మీడియాకూ గుర్తింపు.. ఇకపై రిపోర్టర్లకు, డెస్క్ జర్నలిస్టులకు వేర్వేరు కార్డులు
  •     మీడియా కార్డు ఉన్న జర్నలిస్టులకూ ఆరోగ్య, సంక్షేమ పథకాలు
  •     అక్రెడిటేషన్​ కార్డుల జారీకి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జర్నలిస్టులకు అందించే మీడియా అక్రెడిటేషన్ కార్డుల జారీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, కొత్త మార్గదర్శకాలతో కూడిన ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025’ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు సోమవారం సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మారుతున్న మీడియా పోకడలకు అనుగుణంగా డిజిటల్ మీడియాను పరిగణనలోకి తీసుకోవడం, రిపోర్టర్లకు, డెస్క్ జర్నలిస్టులకు వేర్వేరు కార్డులను ప్రతిపాదించడం ఈ కొత్త నిబంధనల్లో ఉన్నాయి. 

అక్రెడిటేషన్ కమిటీల కాలపరిమితిని రెండేళ్లుగా నిర్ణయించిన సర్కార్, కొత్త కమిటీలు ఏర్పడే వరకు పాతవే కొనసాగుతాయని స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం జర్నలిస్టులకు ఇచ్చే కార్డులను రెండు రకాలుగా వర్గీకరించారు. క్షేత్రస్థాయిలో వార్తలు సేకరించే రిపోర్టర్లకు ‘అక్రెడిటేషన్ కార్డు’ను జారీ చేస్తారు. 

ఇది ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లడానికి, సమాచారాన్ని సేకరించడానికి గుర్తింపుగా పనిచేస్తుంది. ఇక డెస్క్‌‌లో పనిచేసే జర్నలిస్టులు (సబ్ ఎడిటర్లు), ఇతర సాంకేతిక సిబ్బందికి ‘మీడియా కార్డు’ను జారీ చేస్తారు. ఇది కేవలం ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు, ఇతర సంక్షేమ ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అలాగే తొలిసారిగా డిజిటల్ న్యూస్ మీడియా (వెబ్‌‌సైట్లు)కు అక్రెడిటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సదరు వెబ్‌‌సైట్‌‌కు గత ఆరు నెలల కాలంలో నెలకు కనీసం 5 లక్షల మంది విజిటర్స్ (యూనిక్ విజిటర్స్) ఉంటేనే అర్హత లభిస్తుంది. ఈ కేటగిరీ కింద రాష్ట్రవ్యాప్తంగా ఒక వెబ్‌‌సైట్‌‌కు గరిష్టంగా 10 కార్డులు మాత్రమే మంజూరు చేస్తారు.

వెటరన్ జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్లకు..

అర్హతల విషయానికి వస్తే, కనీసం 2,000 ప్రతుల సర్క్యులేషన్ ఉండి, పీఆర్‌‌జీఐ రిజిస్ట్రేషన్ ఉన్న దినపత్రికలకే అక్రెడిటేషన్ సౌకర్యం ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో సాటిలైట్ చానెళ్ల కంటెంట్‌‌లో 50 శాతం వార్తలు ఉండాలని, లోకల్ కేబుల్ చానెళ్లు రోజుకు కనీసం 3 న్యూస్ బులెటిన్లు టెలికాస్ట్ చేయాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. జర్నలిస్టుల విద్యార్హత విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 

స్టేట్ లెవల్ అక్రెడిటేషన్ పొందే వారికి డిగ్రీ లేదా ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. నియోజకవర్గ, మండల స్థాయి విలేకరులకు ఇంటర్​ విద్యార్హతను తప్పనిసరి చేశారు. మరోవైపు 15 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, 30 ఏళ్ల అనుభవంతో పాటు 58 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు కూడా గుర్తింపు కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇక కమిటీల స్వరూపాన్ని పరిశీలిస్తే.. రాష్ట్ర స్థాయి కమిటీకి  మీడియా అకాడమీ చైర్మన్, జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్‌‌గా వ్యవహరిస్తారు. 

ఈ కమిటీల్లో జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులు, పీసీఐ సభ్యులు ఉంటారు. ఎవరైనా అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా, తప్పుడు సమాచారం ఇచ్చి కార్డు పొందినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా ఆ కార్డులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. కార్డు పోగొట్టుకున్న పక్షంలో డూప్లికేట్ కార్డు కోసం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.