పాట్నా: బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. నితీశ్ రాజ్యసభకు వెళ్తారని.. ఆయన కొడుకు నిశాంత్‌కుమార్ బిహార్ డిప్యూటీ సీఎం అవుతారని ఆ రాష్ట్రంలో జోరుగా చర్చ నడుస్తున్నది. బీజేపీ నాయకుడికి సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని జాతీయ మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. గురువారం నితీశ్ రాజ్యసభకు నామినేషన్ వేస్తారని సోర్సులు చెప్తున్నాయి. నితీశ్‌కుమార్ కొడుకు నిశాంత్ ఇప్పటి వరకు రాజకీయాల్లో లేరు. అయితే ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని జేడీయూ మంత్రులు కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. వాటిని నితీశ్, నిశాంత్, జేడీయూ ఖండించలేదు. 75 ఏండ్ల నితీశ్ కుమార్ ఇప్పటి వరకు 10 సార్లు బిహార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
2015 నుంచి ఆయన బిహార్ సీఎంగా కొనసాగుతున్నారు. సైకిల్, మద్య నిషేధం వంటి పథకాలతో ఆయన ప్రజల అభిమానం పొందారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. అయితే ముఖ్యమంత్రి మార్పు రాజ్యసభ ఎన్నికల తర్వాత ఉండొచ్చని తెలుస్తున్నది. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయనకు సీఎం పదవి ఇవ్వడం లేదని చాలా మంది పొలిటికల్ అనలిస్టులు పేర్కొన్నారు. కానీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ తమ కూటమి ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్‌నే ఎంపిక చేసింది.
