యువతిని చితకబాదిన యువకుడి ఇల్లు కూల్చేసిన్రు

యువతిని చితకబాదిన యువకుడి ఇల్లు కూల్చేసిన్రు

ఉత్తరప్రదేశ్ మాదిరిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఇళ్లను కూల్చివేస్తోంది. మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో పెళ్లి చేసుకోమని ప్రియుడిని నిలదీసినందుకు ప్రియురాలిని చితకబాదిన ఘటనపై అక్కడి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సదరు యువకుడి ఇళ్లు అక్రమంగా నిర్మించారంటూ బుల్డోజర్తో కూల్చేశారు. ఇంటిని కూలుస్తున్న వీడియోను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మిర్జాపూర్‌లో పంకజ్‌ త్రిపాఠిని అరెస్ట్‌ చేసినట్లు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ‘‘నేరస్థుడు వృత్తిరీత్యా డ్రైవర్‌ కావడంతో అతడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేశాం. అతడి ఇల్లు కూడా అక్రమంగా నిర్మించాడని తేలడంతో ఆ ఇంటిని కూల్చివేశాం. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మౌగంజ్‌ పీఎస్‌ టీఐని సస్పెండ్‌ చేశాం’’ అని సీఎం ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారెవరినీ వదిలిపెట్టం అని సీఎం హెచ్చరించారు.

మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో పెళ్లి చేసుకోమని నిలదీసినందుకు పంకజ్ త్రిపాఠి అనే యువకుడు ప్రియురాలిని పంటపొలాల్లోకి తీసుకెళ్లి దారుణంగా కొట్టాడు. నేలపై పడేసి తీవ్రంగా కొట్టడంతో ఆ యువతి స్పృహతప్పి పోయింది. చాలాసేపు రోడ్డు పక్కన అపస్మారక స్థితిలోపడి ఉండగా స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్న యువతిని ఆస్పత్రికి తరలించారు.