- ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు అలాట్ మెంట్ లెటర్లు
ఖమ్మం, వెలుగు : అల్పాదాయ వర్గాల ప్రజలకు అందుబాటులోని ధరల్లో సొంత ఇంటి వసతిని కల్పించాలన్న సంకల్పంతో హౌసింగ్ బోర్డు ప్రకటించిన ఎల్ఐజీ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను వాయిదా వేసినట్టు హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజినీర్ జి.వి.రమణా రెడ్డి తెలిపారు. స్థానిక శ్రీరాం నగర్ లో సుప్రభాత్ ఇన్ ఫ్రా ప్రాజెక్టు భాగస్వామ్యంతో హౌసింగ్ బోర్డు నిర్మించిన 126 ఎల్ఐజీ ఫ్లాట్లను అల్పాదాయ వర్గాలకు విక్రయించాలని నిర్ణయించి గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ఇవాళ నిర్వహించాల్సి ఉండగా, దానిని వాయిదా వేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫ్లాట్ల కోసం 23 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి భయాందోళనలకు లోను కావల్సిన అసరం లేదని, అర్హులైన వారికి ప్రాథమికంగా ఫ్లాట్ కేటాయించినట్లుగా లెటర్ కూడా ఇస్తామని ఆయన వివరించారు. మరోవైపు ఈ ప్రాజెక్టులో నిర్మించిన ఫ్లాట్లకు రాకపోకలకు అంతరాయం కలిగేలా నిర్మించిన ప్రహరీని శుక్రవారం అధికారులు కూల్చి వేశారు. దీంతో ప్రస్తుత సుప్రభాత్ వెంచర్ నుంచే ఎల్ఐజీ బ్లాకులకు మార్గం ఏర్పడింది.
ఈ ప్రహరీ, రోడ్డు విషయంలోని వివాదం కారణంగానే ఎల్ఐజీ ఫ్లాట్ల కొనుగోలుకు ప్రజలు ముందుకు రాలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం గోడలను తొలగించి రహదారిని క్లియర్ చేశారు. ఎల్ఐజీ ఫ్లాట్ల కు సంబంధించిన కీలకమైన రోడ్డు సమస్య పరిష్కారమైనందున, వీటి కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే వారికి మరో అవకాశం ఇచ్చేలా, దరఖాస్తులను స్వీకరించడంతోపాటు, లాటరీ ద్వారా కేటాయించే ప్రక్రియ కూడా చేపడతామని చీఫ్ ఇంజినీర్ తెలిపారు. ఇందుకు సంబధించిన షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వివరించారు.
