ఖమ్మం రూరల్, వెలుగు : రోడ్డు భద్రత కేవలం ప్రభుత్వానిది మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్అనుదీప్ దురిశెట్టి సూచించారు. -జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేసి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఆయన పర్యటించారు. ఏదులాపురం మున్సిపాలిటీలోని వెంకటగిరి, కోదాడ, వరంగల్ క్రాస్ రోడ్స్, ఏదులాపురం జంక్షన్ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ అనితతో కలిసి రోడ్డు భద్రతా పనులను పరిశీలించారు.
అనంతరం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డు, కొత్త బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, బల్లేపల్లి సెంటర్, రఘునాథపాలెం ఆపిల్ సర్కిల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్యతో కలిసి రోడ్డు భద్రతా పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 30 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రంబుల్ స్ట్రిప్స్, సైన్ బోర్డులు, జీబ్రా క్రాసింగ్స్, ఫుట్‌పాత్‌ల వంటి భద్రతా చర్యలను అమలు చేయాలని అధికారులకు సూచించారు.
ప్రధాన జంక్షన్ల వద్ద రోడ్డుపై 'గో స్లో' వైట్ పేయింట్ వేయడం, స్కూల్ జోన్‌ల వద్ద ప్రత్యేక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ రోడ్డు యాక్సిడెంట్ డిటెక్షన్ సెంటర్ (ఐఆర్ఏడీ)ను పరిశీలించారు. ఆయన వెంట ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకోబ్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, నేషనల్ హైవే పీడీ దివ్య, ఈఈ యుగంధర్, మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ, అధికారులు ఉన్నారు.
