యూఎస్, కెనడాకు సీఎం?..ఆగస్టులో 10–15 రోజుల టూర్

యూఎస్, కెనడాకు సీఎం?..ఆగస్టులో 10–15 రోజుల టూర్
  • రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ నెలలో ఆయన సుమారు 10 నుంచి 15 రోజుల పాటు అమెరికా(యూఎస్), కెనడా దేశాల్లో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను వారికి వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.

పారిశ్రామిక రంగంతో పాటు విద్య, వినూత్న ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధికి సంబంధించిన విదేశీ సాంకేతికత, విధానాలపై సీఎం ప్రత్యేకంగా స్టడీ చేయనున్నారు. ప్రధానంగా ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు తెలంగాణ వైపు మొగ్గు చూపేలా ఈ పర్యటన సాగనుండగా, సమగ్ర షెడ్యూల్, అధికారిక ప్రతినిధుల బృందం వివరాలు త్వరలోనే ఖరారు కానున్నాయి.