మూడు నెలల పాలన ఎట్లుంది

మూడు నెలల పాలన ఎట్లుంది
  •     ఫీల్డ్ రిపోర్ట్​ తెప్పించుకుంటున్న సీఎం రేవంత్​
  •     మంత్రులు, ఎమ్మెల్యేలు జనాలతో ఎట్లుంటున్నరు
  •     గ్యారంటీలపై ప్రజల ఫీడ్​బ్యాక్​తెలుసుకుంటున్నరు
  •     సమాచారం ఆధారంగా పాలనలో మరిన్ని మార్పులు తెచ్చే యోచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిసింది. డిసెంబర్​ 7వ తేదీన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మార్చి 7వ తేదీకి మూడు నెలలు పూర్తవడం, పార్లమెంట్ ఎన్నికలకు త్వరలోనే షెడ్యూల్ రానుండటంతో కాంగ్రెస్ పాలన ఎలా ఉందనే దానిపై సీఎం క్షేత్రస్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నరు.

 ఈ మూడు నెలల పాలనను గత సర్కార్​తో పొలిస్తే తేడా ఉందనే విషయం జనాల్లోకి వెళ్లిందా లేదా? ఇంకా ఏ విషయంలో వెనకబడినమో తెలుసుకునేందుకు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఇప్పటికే అమల్లోకి వచ్చినా గ్యారంటీల అమలుపై ప్రజల వాస్తవ స్పందన తెలుసుకోనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద జిరో కరెంటు బిల్లులు, రూ.500లకు గ్యాస్​ సిలిండర్లపైనా జనాలు అభిప్రాయాలు తెలుసుకుని.. మరింత బాగా అమలు కావాలంటే ఏం చేయాలనే దానిపై ఆలోచన చేయనున్నట్లు తెలిసింది.

మంత్రులు.. ఎమ్మెల్యేలు ప్రజల్ని కలుస్తున్నరా

మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై కూడా సీఎం రేవంత్​వివరాలు తెప్పించుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలను ఎలా కలుస్తున్నారు? డిపార్ట్​మెంట్లలో మంత్రుల వ్యవహారం ఎలా ఉందో కూడా తెలుసుకోనున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలను కలుస్తున్నారా? అధికారులతో ఎలా ప్రవర్తిస్తున్నారనే అనే కోణంలో సమాచారం సేకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో నాటి అధికారి పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వారి ప్రాంతంలో ఎలా వ్యవహరిస్తున్నారు? కిందిస్థాయి లీడర్లతో సఖ్యత ఎలా ఉంటుంది? ఇతర పార్టీల నుంచి వస్తామంటున్న లీడర్లను తీసుకుంటున్నారా? కొత్తగా చేరిన వారిని కలుపుకుపోతున్నారా లేదా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా పనిచేస్తారనే దానిపై ఒక అంచనా కోసం సీఎం రేవంత్ ఈ వివరాలను తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. జనాలకు అందుబాటులో ఉంటున్నారా? వారి సమస్యలకు ఎలా స్పందిస్తున్నారనేది కూడా తెలుసుకుంటున్నారు.మంత్రులు.. ఎమ్మెల్యేలు ప్రజల్ని కలుస్తున్నరా

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నా..

సాధారణంగా సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యమైన పరిణామాలపైనా ఇంటెలిజెన్స్ రోజువారీగా రిపోర్ట్​ను అందిస్తుంది. పొలిటికల్ డెవలప్​మెంట్లతో పాటు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు సీఎంకు ఇంటెలిజెన్స్ చేరవేస్తుంది. ఆ రిపోర్టులతో పాటు తనకు దగ్గరగా ఉన్నవాళ్లతో గ్రౌండ్ లెవెల్ పొలిటిల్ ఇష్యూస్, ప్రభుత్వ పాలన, ప్రజల అభిప్రాయం ఏంటనేది ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. కిందిస్థాయి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా పాలనలో మరిన్ని మార్పులు తీసుకురావాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది.