కేటీఆర్ కొడుక్కు 40 ఎక‌‌‌‌రాల  భూమి ఎలా వ‌‌‌‌చ్చింది? : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

కేటీఆర్ కొడుక్కు 40 ఎక‌‌‌‌రాల  భూమి ఎలా వ‌‌‌‌చ్చింది? : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి
  • కేసీఆర్‌‌‌‌కు చిన్నప్పుడే 2 ఎక‌‌‌‌రాల్లో ఇల్లు ఉంటే 
  • 2004 అఫిడ‌‌‌‌విట్‌‌‌‌లో ఎందుకు చేర్చలేదు?
  • మీడియాతో చిట్‌‌‌‌చాట్‌‌‌‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి 
  • సిద్దిపేట‌‌‌‌లో నేతలు ఆక్రమించుకున్న భూముల్లో పేద‌‌‌‌ల‌‌‌‌కు ఇండ్లు కట్టిస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ కొడుక్కు 40 ఎకరాల భూమి ఎలా వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘ఈ విషయం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ నూనుగు మీసాల పిల్లోడు ఏ వ్యాపారం చేసి సంపాదించాడు?’’ అని అడిగారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌‌‌‌లో భూములు లేవని చెప్పిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు.. ఇప్పుడు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని నిలదీశారు. సిద్దిపేటలో నేతలు ఆక్రమించుకున్న భూముల్లో పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.

శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చిట్ చాట్ చేశారు. కేటీఆర్ చెప్పిన‌‌‌‌ట్టు కేసీఆర్‌‌‌‌కు చిన్నప్పుడే 2 ఎక‌‌‌‌రాల్లో ఇల్లు ఉంటే.. ఆ విషయాన్ని 2004 ఎన్నికల అఫిడ‌‌‌‌విట్‌‌‌‌లో ఎందుకు చేర్చలేదని అడిగారు. కేసీఆర్ కుటుంబ భూములపై జరుగుతున్న చర్చలో ఎన్నికల అఫిడవిట్లలో నమోదైన వివరాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై ప్రస్తుత వాదనలు, అప్పటి అఫిడవిట్ల వివరాల మధ్య ఉన్న తేడాలను రికార్డుల ఆధారంగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. 

అసైన్డ్​భూముల్లోని పట్టాదారులను ఇబ్బంది పెట్టం

అసైన్డ్ పట్టాదారులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చెప్పారు. పట్టాలిచ్చిన అసైన్డ్ భూములను లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఈ మేరకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూములపై నెలకొన్న వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలంటే రికార్డులు, భౌతిక పరిస్థితి రెండింటినీ సమన్వయం చేయాల్సి ఉంటుందని అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి, నేను మాట్లాడే ప్రతి అంశానికి డాక్యుమెంట్లు, అధికారిక రికార్డులు ఉన్నాయి.

సర్వే పూర్తయిన తర్వాత సాంకేతిక ఆధారాలతో వాస్తవాలు బయటకు వస్తాయి. కేసీఆర్ ఫామ్‌‌‌‌ హౌస్‌‌‌‌కు సంబంధించిన భూముల్లో ప్రభుత్వ జాగా ఉన్నట్టు సర్వేలో తేలితే, చట్టప్రకారం ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటం. అర్హులైన పేదలకు, ముఖ్యంగా దళితుల ఇళ్లకు వినియోగించే అంశాన్ని పరిశీలిస్తాం” అని తెలిపారు. హరీశ్‌‌‌‌ రావు తన ఎన్నికల అఫిడవిట్‌‌‌‌లో చూపిన భూములు, ప్రస్తుతం ఉన్న భూములు, ట్రస్ట్ పేర్లతో ఉన్న భూములు తదితర అంశాలను కూడా పరిశీలిస్తామని మంత్రి అన్నారు. సిద్దిపేట ప్రాంతంలో భూ అక్రమాల‌‌‌‌ను వెలికితీసి అక్కడ ఇందిర‌‌‌‌మ్మ ట‌‌‌‌వ‌‌‌‌ర్స్ నిర్మిస్తామ‌‌‌‌ని చెప్పారు. రంగనాయకసాగర్ పరిసర భూముల విషయంలో అప్పటి ఇరిగేషన్ శాఖ రికార్డులు, ఎఫ్‌‌‌‌టీఎల్, బఫర్ జోన్, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాల్సి ఉందని అన్నారు.