
హిందువులు అందరూ పూజలు చేస్తుంటారు. కొంతమంది ఎన్ని పూజలు చేసినా కలసి రాదు. దీని ప్రకారం ఆలోచిస్తే గత జన్మలో చేసిన పాప.. పుణ్యాల వలన ఈ జన్మలో కర్మ ఫలాన్ని జీవితం కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మోక్షం పొందేందుకు పూజలు .. పునస్కారాలు చేస్తుంటారు. అసలు మోక్షం అంటే ఏమిటి..? దానిని ఎలా పొందాలి.. ఈ విషయంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం...!
ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గము.. నరకం అనుభవిస్తూ... మరల మరల జన్మలెత్తుతుంటారు. ఈ జనన... మరణ సంసారచక్రంలో ఉండిపోవలసిందేనా? లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.
యత్కరోషి, యదశ్నాసి, యజ్జుహోషి దదాసియత్
యత్తపస్యసి, కౌంతేయ! తత్కురుష్వమదర్పణమ్
తా" అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, అదంతా నాకు సమర్పించు.అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కర్యాలకు పూనుకుంటాము.
రెండవది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.
మూడోది సంగత్యాగం. ఇది నాది... ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నాఆనందం అని మనస్పూర్తిగా అనుకోవాలి.
పురాణాల ప్రకారం కనపడే శరీరం పోయినా ఈ సూక్ష్మశరీరం ఉంటుంది. అదే పైలోకాలకు తిరిగేది . స్వర్గం... నరకం అనుభవించేది కూడా ఆత్మే. ప్రకృతి... ఆత్మ తప్ప మిగిలినదంతా ప్రకృతియే. మనస్సు, ఇంద్రియాలు, శరీరం, కంపడే అంతా ప్రకృతియే. ప్రకృతినే ప్రధానము, అవ్యక్తము, మాయ అనే పేర్లున్నాయి.మట్టియే కుండగా మార్పుచెందినట్లు ప్రకృతే ఈ జగత్తుగా మారుతుంది. ధర్మంగా జీవించాలని.. ధర్మబద్దమైన పనులను చేయాలని అప్పుడే మోక్షం కలుగుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు.
జ్ఞానం కలిగి మోక్షం సిద్దించేంత వరకు ఎన్ని జన్మలైనా కలుగుతూనే ఉంటాయి. ఆ జన్మలు ఇన్ని, ఇవి అని చెప్పడం సాధ్యం కాదు.రానున్న జన్మలు ఏ రూపంలో ఉంటాయో కూడా చెప్పలేం.. ఇప్పటి వరకు అనుభవించిన జన్మల పాప.. పుణ్యాల వలన ఎలా జన్మించాలో భగవంతుడు నిర్దేశిస్తాడు.. జంతువు కావచ్చు.. చెట్టు కావచ్చు.. క్రిములు కావచ్చు.. ఏ రూపం అనేది మాత్రం చెప్పలేము. ప్రస్తుత జన్మలో మనం చేసుకున్న కర్మఫలితంగా వచ్చే జన్మ ఆధారపడి ఉంటుంది.
ధర్మబద్ధంగా అంటే.. ఒకరిని అన్యాయం చేయకుండా.. డబ్బులు సంపాదించి... దానితో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకొని... తద్వారా మోక్షం పొందుమని దీని అర్ధం. ధర్మస్వరూపాన్ని తెలుసుకుని మంచి ప్రవర్తనతో... ధర్మాన్ని రక్షించాలి. సత్ప్రవర్తనతో ధర్మాన్ని రక్షించి మోక్షాన్ని పొందాలని శ్రీకృష్ణుడు మోక్షం గురించి వివరించాడని భాగవతంలో చెప్పబడింది.