ఆసక్తి కలిగించే న్యాయవ్యవస్థ సంగతులు..న్యాయం–చట్టం–తీర్పులు–అమలు తీరు ఎలా ఏర్పడ్డాయి..

ఆసక్తి కలిగించే న్యాయవ్యవస్థ సంగతులు..న్యాయం–చట్టం–తీర్పులు–అమలు తీరు ఎలా ఏర్పడ్డాయి..

స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ చాలామందికి న్యాయవ్యవస్థ గురించి సరిగా తెలియదు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన ఈ వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఏం పనిచేస్తుంది? ఇందులోని ముఖ్య విభాగాలు ఏంటి ? అనేవి తెలుసుకోవడం ఎంతో అవసరం. 

సంక్లిష్టమైన ఈ వ్యవస్థ గురించి అందరూ సమగ్రంగా తెలుసుకోవడం కష్టమైన పని. కానీ, కనీస అవగాహన అయినా ఉండాలి. అందుకు ఉపయోగపడేవాటిలో రచయిత వై.వై.రెడ్డి యానాల రాసిన ‘న్యాయం–చట్టం–తీర్పులు–అమలు తీరు’  పుస్తకం ఒకటి. న్యాయవ్యవస్థలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు, మార్పులు, చట్టాలు, తీర్పులపై న్యాయ కోవిదుల విశ్లేషణలు, పరిశోధక కథనాలు, వార్తలు, వ్యాసాల ఆధారంగా రచయిత అందించిన పుస్తకమిది. 

రాజ్యాంగానికి లోబడి చట్టాలు తయారవుతున్నాయా/అమలవుతున్నాయా? అని పర్యవేక్షించడం, తప్పు చేసినవాళ్లకు శిక్షలు విధించడం, ప్రజల హక్కులను కాపాడడం న్యాయవ్యవస్థ ప్రధాన బాధ్యతలు. ఈ ప్రక్రియల్ని సమర్థంగా అమలుచేయడంలో కోర్టులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎంతో ముఖ్యం. వీటి గురించి ఈ పుస్తకంలో రచయిత ప్రస్తావించారు.

 సుప్రీంకోర్టు, హైకోర్టులు, ట్రిబ్యునళ్ల విధుల గురించి వివరించారు. న్యాయవ్యవస్థకు ఎదురైన కొన్ని సంక్లిష్ట పరిస్థితులనూ ఉటంకించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను గవర్నర్లు/రాష్ట్రపతి ఆమోదం తెలిపే విషయంపై ఇటీవల ఎదురైన సమస్య సైతం ఉంది. అలాగే న్యాయవ్యవస్థకు కళంకం తెచ్చేలా వ్యవహరించిన కొందరు వ్యక్తులు/ అంశాల గురించీ ప్రస్తావించారు.  

అత్యున్నత న్యాయస్థానం సైతం కొన్నిసార్లు తన తీర్పులను పునఃసమీక్షించుకున్న విషయాలు ఆసక్తికరం. ఆ సంగతులను పుస్తకంలో పొందుపరిచారు. న్యాయస్థానాలు/న్యాయమూర్తులు విచక్షణాధికారం ఉపయోగించిన సందర్భాల విషయాలూ ప్రత్యేకమే. కోర్టు ధిక్కరణ, న్యాయసమీక్ష, పిల్​, వివిధ రకాల రిట్​లు, ఎఫ్​ఐఆర్​, బెయిల్​ వంటి వాటిని వివరించారు. భాష సరళంగా ఉంది. న్యాయవ్యవస్థ పై కాస్త అవగాహన పెంచుకోవాలనుకునే వాళ్లకు ఈ పుస్తకం ఉపయుక్తం.
  
- సాయిప్రేమ్​-