ఆన్​లైన్​ మోసాలు కనిపెట్టొచ్చు ఇలా

ఆన్​లైన్​ మోసాలు కనిపెట్టొచ్చు ఇలా

ఇంటర్​ చదువుతున్న రమ్య (పేరు మార్చాం)కి ఇన్​స్టాగ్రామ్​లో ఓ అబ్బాయి నుంచి  రిక్వెస్ట్​ వచ్చింది. మ్యూచువల్​ ఫాలోవర్స్​ ఉన్నారని ఆమె యాక్సెప్ట్​ చేసింది. అతడు రమ్య పెట్టే ప్రతి పోస్ట్​కి లైక్​ కొట్టేవాడు. కామెంట్లు పెట్టేవాడు. చాటింగ్​ కూడా మొదలైంది. చనువు పెరగడంతో రమ్య తన ఫొటోలు పంపింది. ఆ వెంటనే  ‘కలుద్దాం’ అని మెసేజ్​ వచ్చింది అతడ్నించి. ఆమె కుదరదనడంతో.. నీ ఫొటోలు, మెసేజ్​లు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. రమ్య ఒత్తిడి తట్టుకోలేక పేరెంట్స్​కు విషయం చెప్పింది. వాళ్లు సైబర్ క్రైమ్​ పోలీసులకు కంప్లయింట్ ఇస్తే.. రమ్యని బ్లాక్​ మెయిల్​ చేస్తోంది ఆమె క్లాస్​మేట్​​ అరుణ్ అని తేలింది. రమ్యని ట్రాప్​ చేయడానికే ఫేక్​ అకౌంట్​ క్రియేట్​ చేసుకున్నాడట అతడు.రమ్య లాంటి బాధితులు మన చుట్టుపక్కల గల్లీకొకరు ఉన్నారు. రోజుకి ఇలాంటి సంఘటనలు వేలల్లో జరుగుతున్నాయి. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, స్నాప్ చాట్, ట్విట్టర్.. ఇలా ఏ సోషల్​ మీడియా ప్లాట్​ఫాంలోనైనా మైనర్లే టార్గెట్​గా ఫేక్​ అకౌంట్లు పుట్టుకొస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి సైబరాబాద్​ డిసీపీ సి.అనసూయ చెప్తున్న జాగ్రత్తలివి. 

18– 23 ఏండ్ల అమ్మాయిల సోషల్​ మీడియా అకౌంట్ల  ​ఫ్రెండ్​ లిస్ట్​లో  ఫేక్​ ప్రొఫైల్స్​​ ఎక్కువగా ఉంటున్నాయి. పరిచయంపెంచుకుని అమ్మాయిల  ఫొటోలు, వీడియోలు సేకరించడం, వాటిని మార్ఫింగ్​ చేసి బెదిరించడం లాంటివి చేస్తున్నారు. అందుకే అమ్మాయిలు తెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ వస్తే,  బ్యాక్‌‌గ్రౌండ్ వెరిఫై చేయాలి. వాళ్లు ఎప్పట్నించి సోషల్​ మీడియాలో ఉన్నారన్నది చెక్​ చేయాలి. ప్రొఫైల్​ ఫొటో, ఎలాంటి పోస్ట్​లు లేని రిక్వెస్ట్​లని అసలు యాక్సెప్ట్​ చేయకూడదు. 

పబ్లిక్​ ప్లాట్​ఫామ్స్​లో  పర్సనల్​ ఫొటో, వీడియో అప్​లోడ్​ అయిందంటే  పరిస్థితి చెయ్యి దాటినట్టే. మాకు సమాచారం ఇచ్చినా.. మేము ట్రేస్​ చేసే గ్యాప్​లోనే..  చాలామంది ఆ ఫొటోల్ని డౌన్​లోడ్​ చేసుకుంటారు. అందుకే అమ్మాయిలు తెలియని వ్యక్తులకి ఫొటోలు, వీడియోలు పంపకూడదు.  అలాగే సోషల్​ మీడియా అకౌంట్​ ప్రైవేట్​లో ఉన్నా.. పబ్లిక్​లో ఉన్నా.. షేర్ చేసే పోస్ట్‌‌లు ఎవరూ డౌన్‌‌లోడ్ చేసుకోకుండా సెట్టింగ్స్​ పెట్టుకోవాలి. వేరేవాళ్లు తమ పోస్ట్‌‌లకు మనల్ని ట్యాగ్ చేయకుండా సెట్టింగ్స్  మార్చుకోవాలి. అంతేకాకుండా పబ్లిక్ అకౌంట్స్​లో ఎంతోమంది మెసేజ్‌‌లు, కామెంట్లు పెడుతుంటారు. అలాకాకుండా ఫాలో అయ్యేవాళ్లకి, ఫ్రెండ్స్​కి మాత్రమే మెసేజ్​ పంపే ఛాయిస్​ ఇవ్వాలి.  వీటన్నింటితో పాటు తెలియక ఎవరినైనా ఫ్రెండ్ గా యాక్సెప్ట్‌‌ చేసినా  వాళ్ల  ప్రవర్తన మితిమీరితే వెంటనే బ్లాక్​ చేయాలి.

అమ్మాయిల అకౌంట్స్​ని హ్యాక్​ చేసి, అందులోని​ ఫొటోల్ని మార్ఫింగ్​ చేసేవాళ్లు ఉన్నారు. ఇలాంటి వాటికి చిక్కకూడదంటే.. ఫేస్​బుక్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌, వాట్సాప్‌‌లలో టు స్టెప్ వెరిఫికేషన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆన్ చేసుకుంటే మన అకౌంట్లు ఇంకొకరి చేతుల్లో పడకుండా ఉంటాయి. ఫేక్​ అకౌంట్స్​లో చాలావరకు ప్రొఫైల్​ ఫొటోలు గూగుల్​ నుంచి డౌన్​లోడ్​ చేసినవే ఉంటాయి. అందుకే తెలియని వ్యక్తుల రిక్వెస్ట్​ యాక్సెప్ట్​ చేసేముందు... గూగుల్​ ఇమేజ్​ టూల్​లోకి వెళ్లి వెరిఫై చేయాలి. అలాగే వాళ్ల ఇతర సోషల్​ మీడియా అకౌంట్స్​ని చెక్​ చేయాలి. బయోడేటాని మ్యాచ్​ చేసి చూడాలి. మ్యూచువల్​ ఫ్రెండ్స్​ ఎలాంటి వాళ్లు అన్నది చూడాలి. 

నిక్​ నేమ్స్​, నెంబర్స్​తో ఉండే అకౌంట్స్​ నుంచి వచ్చిన రిక్వెస్ట్​లని యాక్సెప్ట్​ చేయకూడదు. అలాగే హీరో, హీరోయిన్ల ఫొటోల్ని, దేవుడి బొమ్మల్ని ప్రొఫైల్​గా పెట్టుకున్నా అనుమానించాల్సిందే. ఒకరిద్దరు ఫాలోవర్స్​ మాత్రమే ఉన్న అకౌంట్స్​ నుంచి వచ్చిన రిక్వెస్ట్​లని పట్టించుకోకూడదు. ఒకే అకౌంట్​ నుంచి పదేపదే రిక్వెస్ట్​ వస్తుందంటే అది ఫేక్​ అకౌంట్​ అనే అర్థం.  అన్నింటికీ మించి... సరదాగా మాట్లాడుతున్నారు కదా! అని తెలియని వ్యక్తుల్ని కలవకూడదు. అప్పుడే ఈ మోసాల బారినుంచి తప్పించుకోగలుగుతారు. 

అంజుమా మహ్మద్​, హైదరాబాద్, వెలుగు