హైదరాబాద్లో ఘోరం.. ఆరు నెలల గర్భవతిని గొంతునులిమి చంపేసిన భర్త

హైదరాబాద్లో ఘోరం.. ఆరు నెలల గర్భవతిని గొంతునులిమి చంపేసిన భర్త

పండుగ పూట కుటుంబం మొత్తాన్ని విషాదంలో నింపాడు ఒక వ్యక్తి. తాగిన మత్తులో భార్యను కడతేర్చాడు. ఆరు నెలల గర్భిణిగా ఉన్న నవవధువును భర్త గొంతు నులిమి హతమార్చిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి సూర్య నగర్ లో 2026 సెప్టెంబర్ 14న  చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ తలెత్తగా భార్యను గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి భర్త హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 

అల్వాల్ సూర్య నగర్ లో నివాసం ఉంటున్న పరశురామ్ కు సంవత్సరం క్రితం  శివాని తో వివాహం జరిగింది. పరశురాం రాపిడో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగించేవాడని భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగానే ఉండేవారని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 13 రాత్రి మద్యం సేవించిన పరుశురాం అర్ధరాత్రి 12 గంటల సమయంలో భార్యతో గొడవ జరిగింది. ఈ గొడవలో కోపోద్రిక్తుడైన పరుశురాం గర్భవతిగా ఉన్న తన భార్య గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

 భార్యపై అనుమానం తోనే అతను ఆమెతో గొడవ పడి హతమార్చి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. గర్భవతిగా ఉన్న నవవధువైన శివాని మృతితో కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి.

మృతురాలి తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ తన కూతురు బాత్రూం వద్ద జారి పడిందని పరశురాం ఫోన్ చేసి చెప్పడంతో హుటాహుటిన వారి నివాసానికి వచ్చినట్లు తెలిపాడు. వెంటనే అంబులెన్స్ కు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న అంబులెన్స్ లోని వైద్య సిబ్బంది అప్పటికే శివాని మృతి చెందిందని నిర్ధారించారు. 

వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు భర్త పై అనుమానంతో ప్రశ్నించగా తానే చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు.