- ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి హెచ్‌ఆర్‌డీఏ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న టీచింగ్ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయసును 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ‘హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్’ (హెచ్‌ఆర్‌డీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 70 ఏండ్లకు వాళ్ల సర్వీసును పొడిగిస్తే వేలాది మంది యువ స్పెషలిస్ట్ డాక్టర్ల భవిష్యత్తు రోడ్డున పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం సంఘం ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. రిటైర్మెంట్ వయసును మరో ఐదేండ్లు పెంచితే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల ప్రమోషన్లు ఎక్కడికక్కడే ఆగిపోతాయని హెచ్‌ఆర్‌డీఏ పేర్కొంది.
పైనున్న వాళ్లు రిటైర్ అయితేనే కింది వాళ్లకు పైకి వెళ్లే అవకాశం వస్తుందని, ఏజ్ పెంచితే ఏండ్ల తరబడి ఒకే పోస్టులో మగ్గిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నవాళ్లనే కంటిన్యూ చేస్తే కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించింది. 65 ఏండ్లు దాటిన తర్వాత చాలా మంది సీనియర్ డాక్టర్లు వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతోనే విధులు నిర్వర్తిస్తున్నారని, వాళ్లపై మరింత భారం మోపడం సరికాదని హెచ్‌ఆర్‌డీఏ అభిప్రాయపడింది. ఒకే వ్యక్తి ఏండ్ల తరబడి అడ్మినిస్ట్రేషన్ పోస్టుల్లో ఉంటే కొత్త ఆలోచనలు, నూతన ఒరవడులు రావని స్పష్టం చేసింది. సీనియర్ ప్రొఫెసర్లను గెస్ట్, ఎమిరిటస్, సలహాదారులుగా నియమించుకోవాలని, రెగ్యులర్ పోస్టుల్లో కూర్చోబెట్టి యువత పొట్ట కొట్టొద్దని సూచించింది.
