బైక్పై స్టంట్..తృటిలో తప్పిన ప్రమాదం

బైక్పై స్టంట్..తృటిలో తప్పిన ప్రమాదం

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బైక్ రైడర్స్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఫ్లెక్సీలు, బోర్డింగ్ లు పెట్టి మరీ ప్రచారం చేసినా పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో ఓ యువకుడు బైక్ పై స్టంట్ చేస్తూ రోడ్డుపై పడిపోయాడు. ప్రమాదకరమని తెలిసినా కూడా అతడు పట్టించుకోకుండా ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఫలితంగా అతడు రోడ్డుపై పల్టీలు కొడుతూ కిందపడిపోయాడు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో గాయాలతో బయటపడ్డాడు. మోటార్‌సైకిల్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న యువకుడు వీడియోను ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

జనసంచారం తక్కువగా ఉన్న రోడ్డుపై ఒక వ్యక్తి తన మోటార్‌సైకిల్‌ను ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ స్టంట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బైక్ పై కొద్దిదూరం వెళ్లిన రైడర్ తన ముందున్న వాహనాల మధ్య వేగంగా దూసుకుపోతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మేరీ మర్జీ అనే హిందీ పాట ప్లే అవుతుంది. బైక్ పై చక్కర్లు కొడుతున్న రైడర్ బ్యాలెన్సింగ్ కోల్పోయి రోడ్డుపై అమాంతం కిందపడిపోయాడు. బైక్ పై ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం డేంజర్ అని తెలిసినా కూడా అతడు లెక్కచేయలేదు. వేగంగా వెళ్తున్న బైక్ పై బ్యాలెన్స్ కోల్పోయి అతను నేలపై పడిపోయాడు. కానీ అతని తల మరొక మోటార్‌సైకిల్ సైలెన్సర్‌ను ఢీకొట్టింది. అదృష్టం ఏమిటంటే అతడి తలకు హెల్మెట్ ధరించడంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రోడ్డుపై పల్టీలు కొడుతూ కిందపడిపోయిన బైకర్ కు గాయాలయ్యాయి. బైక్ మాత్రం కొన్ని మీటర్ల దూరం వరకు వెళ్లి ఆగిపోయింది. 

అయితే బైక్ రైడర్ ప్రమాదకర విన్యాసాలు..రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగిందనే విషయం ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ లో పేర్కొనలేదు. 36 సెకన్ల వీడియోను మాత్రమే పోస్ట్ చేశారు.రోడ్డుపై వెళ్లే వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బైక్ పై వెళ్లేటప్పుడు ప్రమాదకరమైన విన్యాసాలు చేయొద్దని సూచిస్తున్నారు.