- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి సమక్షంలో ఎంవోయూలు
- 40 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు చాన్స్
- పర్యాటకంతోనే ఆర్థిక రంగానికి బూస్ట్: మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో మంగళవారం జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు పర్యాటక రంగంలో ఏకంగా రూ.7,045 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి. సమిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో దేశీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ఈ పెట్టుబడుల ద్వారా 40 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని, ఇందులో ప్రత్యక్షంగా10 వేల, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమిట్లో భాగంగా ‘తెలంగాణ అనుభవాలు – వారసత్వం, సంస్కృతి - ఫ్యూచర్ రెడీ టూరిజం’ అనే అంశంపై మంత్రులు జూపల్లి, కొండా సురేఖ కీలకోపన్యాసం చేశారు.
జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానున్నదన్నారు. 2047 నాటికి రాష్ట్ర జీఎస్డీపీలో టూరిజం వాటాను 10శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో టూరిజానికి అపారమైన కెపాసిటీ ఉందన్నారు. కొత్త పర్యాటక విధానంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు తెలిపారు.
పర్యాటకుల కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలు, భద్రత, వసతి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లగ్జరీ నుంచి బడ్జెట్ వసతి వరకు ఏర్పాట్లు, సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలమైన రోడ్డు సైడ్ ఫెసిలిటీస్ కల్పించడంపై దృష్టి సారిస్తామన్నారు.
ఎకోటూరిజాన్ని ప్రోత్సహిస్తున్నం: సురేఖ
ప్రకృతిని కాపాడుతూనే స్థానిక ప్రజల జీవనోపాధిని పెంచే విధంగా ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి సురేఖ తెలిపారు. ప్రముఖ టైగర్ రిజర్వులతో రాష్ట్రం సహజ సిద్ధమైన సంపదను కలిగి ఉందన్నారు.
మొత్తం 7,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రక్షిత వన్యప్రాణి ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 13 ఎకో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.‘డెక్కన్ వుడ్ అండ్ ట్రయల్స్’ పేరుతో రాష్ట్ర ఎకో టూరిజం బ్రాండును ప్రారంభించామని వెల్లడించారు.

