అడవుల్లో ఉండే కొండచిలువలు అప్పుడప్పుడు జనావాసాల దగ్గర దర్శనమిస్తుంటాయి. పట్టణాల్లో, నగరాల్లో కనిపించే కొండ చిలువలు మరీ అంత పెద్దగా లేకపోయినా.. ఓ మోస్తరు సైజులో భయపెడుతుంటాయి. కానీ అడవుల్లో కనిపించే అతి భారీ కొండచిలువలు హైదరాబాద్ లాంటి సిటీలో ప్రత్యక్షమైతే ఏంటి పరిస్థితి. మంగళవారం (నవంబర్ 25) హైదరాబాద్ లో భారీ కొండచిలువ కలకలం రేపింది.
ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో భారీ కొండచిలువ సంచారం కలకలం రేపుతోంది. స్థానిక చిన్న చెరువు సమీపంలో, ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఒక భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోడ్డు ఎంత ఉందో అంత పెద్దగా ఉండే సరికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ప్రజలు నిత్యం సంచరించే ప్రాంతంలోనే ఇంత పెద్ద పాము తిరుగుతుండటంతో చుట్టుపక్కల నివసించే కాలనీవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని, ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో ఈ భయం మరింత ఎక్కువగా ఉంది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు.
