తిరుమల కల్యాణవేదికకు నూతన వధూవరుల నుండి విశేష స్పందన వస్తోందని తెలిపింది టీటీడీ. టీటీడీ 2016 ఏప్రిల్ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక దగ్గర ఉచిత వివాహాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ వేదికలో 2016 ఏప్రిల్ 25 నుండి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు దాదాపు 26,777 వివాహాలు నిర్వహించినట్లు తెలిపింది టీటీడీ. ఇందులో భాగంగా పురోహితుడు, మంగళవాయిద్యంతో పాటు పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను ఉచితంగా అందిస్తుంది టీటీడీ.
వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వధూవరులే తీసుకురావాల్సి ఉంటుందని... వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుందని తెలిపింది. పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలని పేర్కొంది టీటీడీ .
వివాహం అనంతరం రూ.300 ప్రత్యేక ప్రవేశం ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ వద్ద గల క్యూలైన్ ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని తెలిపింది. దర్శనానంతరం మ్యారేజ్ రిసిప్ట్ నందు ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితంగా లడ్డూలను లడ్డూ కౌంటర్ వద్ద పొందవచ్చని తెలిపింది టీటీడీ.
ఆన్ లైన్ లో బుకింగ్ అవకాశం:
తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ఆన్లైన్లో కల్యాణవేదిక స్లాటును బుక్ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి కల్పించింది టీటీడీ. ఇందుకోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.ఉచిత వివాహలు చేసుకునేవారికి అవకాశాన్ని బట్టి ఒక రూ. 50 రూమ్ CRO/ARP కార్యాలయం దగ్గర పొందవచ్చు.
Also Read : టీటీడీ పేరుతో లక్కీ డ్రా స్కామ్
ఆన్లైన్లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్తులై ఉండాలి. వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి. ద్వితీయ వివాహములు మరియు ప్రేమ వివాహములు ఇక్కడ జరుపబడవు. ఇతర వివరాలకు ఫోన్ – 0877- 2263433 సంప్రదించవచ్చు.
కల్యాణ వేదికలో గత పదేళ్లలో జరిగిన వివాహాల సంఖ్య (సంవత్సరాల వారీగా) :
- 2016-17లో 2731
- 2017-18లో 4705
- 2018-19లో 5047
- 2019-20లో 4443
- 2020-21లో 91
- 2021-22లో 1298
- 2022-23లో 2133
- 2023-24లో 2458
- 2024-25 (డిసెంబర్ వరకు)లో 3871
- మొత్తం వివాహాల సంఖ్య: 26,777
