బీజేపీ హైకమాండ్‌‌‌‌ దృష్టికి హుజూరాబాద్ లొల్లి

బీజేపీ హైకమాండ్‌‌‌‌ దృష్టికి హుజూరాబాద్ లొల్లి
  • ఎంపీ ఈటలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నియోజకవర్గ నాయకుల ఫిర్యాదు
  • స్థానిక ఎన్నికల్లో బీజేపీ టికెట్‌‌‌‌ రాకపోతే... మరో పార్టీ నుంచి ఇప్పిస్తానని ఈటల హామీ ఇచ్చారని ఆరోపణ
  • పార్టీ అనుమతి లేకుండా హుజూరాబాద్‌‌‌‌లో సమావేశాల నిర్వహణపై ఆగ్రహం  

కరీంనగర్, వెలుగు :స్థానిక సంస్థల ఎన్నికల వేళ హుజూరాబాద్‌‌‌‌ బీజేపీలో చిచ్చు రేగింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌‌‌‌పై బీజేపీ కరీంనగర్‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుకు ఫిర్యాదు చేశారు. ఈటల రాజేందర్ ఇటీవల హనుమకొండ జిల్లా కమలాపూర్‌‌‌‌లో స్థానిక బీజేపీ నేతలతో సమావేశమై ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ టికెట్‌‌‌‌ రాకుంటే ఆల్‌‌‌‌ ఇండియా ఫార్వర్డ్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ నుంచి టికెట్‌‌‌‌ ఇప్పిస్తా’ అని హామీ ఇచ్చారని వారు ఆరోపించారు. బీజేపీలో ఉంటూ మరో పార్టీ నుంచి టికెట్‌‌‌‌ ఇప్పిస్తానని ఎలా హామీ ఇస్తారని సొంత పార్టీ నాయకులే ఈటలపై మండిపడుతున్నారు. 

పార్టీ లైన్‌‌‌‌ దాటుతున్నారా ?

ఈ ఏడాది జూలై 17న హుజూరాబాద్‌‌‌‌లో టెన్త్‌‌‌‌ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు వెళ్లిన కేంద్రమంత్రి బండి సంజయ్ ‘వ్యక్తుల పేరుతో గ్రూపులు కడితే సహించను, పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో కొందరు నాకు తక్కువ ఓట్లు రావాలని చూశారు, వారికి స్థానిక సంస్థల్లో ఎలా టికెట్లు ఇవ్వాలి’ అని ప్రశ్నించడం అప్పట్లో ఈటల అనుచరుల్లో కలకలం రేపింది. ఈ  క్రమంలోనే ఎంపీ ఈటల రాజేందర్‌‌‌‌ శామీర్‌‌‌‌పేటలోని తన ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో హుజూరాబాద్‌‌‌‌ లీడర్లతో సమావేశమై బండి సంజయ్‌‌‌‌ని ఉద్దేశించి ‘బీ కేర్ ఫుల్ కొడుకా’ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించిన విషయం తెలిసిందే. 

‘నాకు ఇక్కడ లోకల్‌‌‌‌ బాడీ ఎన్నికలు లేవు. నాకు ఉన్న ఎన్నికలు హుజూరాబాద్‌‌‌‌ లోకల్‌‌‌‌ బాడీ ఎన్నికలే. ఇక అక్కడే మండలాల వారీగా ఆఫీసులు తెరుస్తా... గెలిపించుకుంటా’ అని ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అన్నట్లుగానే ఎంపీ ఈటల రాజేందర్‌‌‌‌ తరచూ హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గానికి వస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మల్కాజ్‌‌‌‌గిరి ఎంపీగా ఉంటూ... పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రందించకుడా హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గంలో ఎలా తిరుగుతారనేది బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గతంలోనే ప్రశ్నించారు. 

ఈ క్రమంలో బీజేపీ టికెట్ రాకపోతే ‘ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్’ బీఫాం ఇప్పిస్తానని ఈటల చెప్పారని కృష్ణారెడ్డి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్‌‌‌‌ ఈటలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

తాజా పరిణామాలపై బండి ఆరా

తన పార్లమెంట్‌‌‌‌ నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్‌‌‌‌లో జరుగుతున్న పరిణామాలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌ ఆరా తీసినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్.. అమ్మవారి దీక్షలో ఉండడంతో మీడియాతో నేరుగా ఎలాంటి రాజకీయ అంశాలు మాట్లాడనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ రాగానే.. అభ్యర్థుల విషయమై ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలకే టికెట్లు ఇస్తామని, వాళ్లను గెలిపించుకునే బాధ్యత తనదని అందులో స్పష్టం చేశారు. 

ఇప్పటికే హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గంలో జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్‌‌‌‌లుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మహాశక్తి ఆలయానికి వచ్చి సంజయ్‌‌‌‌ని కలిసి వెళ్తున్నారు. హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గంలో ఈటల సమావేశాలు, కరీంనగర్‌‌‌‌ కేంద్రంగా బండి సంజయ్‌‌‌‌ మంత్రాంగం ఆ పార్టీలో కీలక పరిణామాలకు దారితీయొచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది.