లివర్​ ఇచ్చి తండ్రి ప్రాణాలు కాపాడిండు

లివర్​ ఇచ్చి తండ్రి ప్రాణాలు కాపాడిండు

కన్నవాళ్లని చివరి రోజుల్లో చూసుకోవడం భారం అనుకుని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తారు కొందరు.  తల్లిదండ్రులకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్లని పట్టించుకోని పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఇతను అలా కాదు. చనిపోతాడు అనుకున్న తండ్రికి  పునర్జన్మ ఇచ్చాడు. లివర్ ఫెయిలైన తండ్రికి తన లివర్​ ఇచ్చి  బతికించుకున్నాడు. వాళ్ల కుటుంబంలో సంతోషాన్ని నింపాడు. ఈ మధ్య ‘హ్యూమన్స్‌‌ ఆఫ్‌‌ బాంబే’ ఫేస్​బుక్​ పేజీ ఈ తండ్రీకొడుకుల స్టోరీని పోస్ట్ చేసింది. వీళ్ల కథ అందర్నీ కదిలిస్తోంది. 

ఒంట్లో  బాగోలేదని హాస్పిటల్‌‌కు వెళ్లిన ఇతని తండ్రికి లివర్​ పాడైందని చెప్పారు డాక్టర్లు.  అప్పటి వరకు  ఆనందంగా సాగుతున్న వాళ్ల జీవితంలో ఊహించని మలుపు అది. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి ఏ చెడు అలవాటు లేదు అతని 45  ఏండ్ల తండ్రికి. దాంతో ఫ్యామిలీ అంతా షాకయ్యారు. తొందరగా లివర్ ట్రాన్స్​ప్లాంట్ చేయాలని. లేదంటే వాళ్ల నాన్న 6 నెలలు మాత్రమే బతుకుతాడన్నారు డాక్టర్లు. దాంతో,  తండ్రికి సరిపోయే లివర్ ఉన్న డోనర్​ కోసం వెతకడం మొదలుపెట్టాడు.  ఇంతలోనే అతనికి కరోనా వచ్చింది.  తండ్రి ప్రాణాలు కాపాడడంతో పాటు అమ్మకు ధైర్యం చెప్పాల్సింది తనే.  కరోనా నుంచి కోలుకున్న తర్వాత‘ ఇక నాన్నను చూసుకోవచ్చు’ అనుకున్నాడు. కానీ, అంతలోనే తండ్రికి కూడా కరోనా వచ్చింది. దానికి తోడు మ్యాచింగ్ లివర్​ డోనర్ దొరకడం లేదు.  ఏం చేయాలో తోచని పరిస్థితి. సరిగ్గా అప్పుడే అతని డిగ్రీ ఫైనల్‌‌ ఇయర్ ఎగ్జామ్స్‌‌ మొదలయ్యాయి.

తన లివర్​ ఇచ్చి కాపాడుకోవాలని

ఎగ్జామ్స్ దగ్గర పడడంతో... హాస్పిటల్‌‌లో అడ్మిట్‌‌ అయిన తండ్రిని చూసుకుంటూనే చదువు కునేవాడు. ‘నా పిల్లల భవిష్యత్తు కోసం ఏమీ చేయకుండానే వెళ్లిపోతున్నాను. వాళ్లు ఉద్యోగం తెచ్చుకోవడం చూడకుండానే చనిపోతానేమో? అని తండ్రి  బాధపడేవాడు. తండ్రిని అలా చూసి లోలోపలే కుమిలిపోయేవాడు అతను. ‘నాకు బతకాలని ఉంది.  నీ గ్రాడ్యుయేషన్‌‌ సర్టిఫికెట్​  చూసి చనిపోవాలని ఉంది’ అని తండ్రి కొడుకుతో అన్నాడు. తండ్రి అలా అనేసరికి ఎమోషనల్​ అయ్యాడు కొడుకు. ఎగ్జామ్​లో మంచి మార్కులతో పాస్​ అవ్వాలని  కష్టపడి చదివాడు. తండ్రికి సేవలు చేస్తూనే, ఫస్ట్‌‌ క్లాస్‌‌లో పాస్‌‌ అవ్వడమే కాకుండా  క్యాంపస్‌‌ ఇంటర్వ్యూలో జాబ్‌‌ కూడా తెచ్చుకున్నాడు. అప్పుడే అతనికి తన లివర్‌‌‌‌ ఇచ్చి తండ్రిని  బతికించుకోవాలనే ఆలోచన వచ్చింది. టెస్ట్​లు చేస్తే తండ్రీ కొడుకుల  లివర్‌‌‌‌ మ్యాచ్‌‌ అయింది. అయితే, అతడి లివర్‌‌‌‌లో ఫ్యాట్‌‌ ఎక్కువ ఉండటంతో ట్రాన్స్‌‌ప్లాంటేషన్‌‌ చేయలేం అన్నారు డాక్టర్లు. దాంతో, నెల రోజుల్లో8 కిలోల బరువు తగ్గి, లివర్‌‌‌‌ డొనేట్​ చేశాడు. కొడుకు లివర్​లో సగానికి పైగా తీసి, తండ్రికి అమర్చారు. ఇప్పుడు తండ్రీ కొడుకులు  ఇద్దరూ ఫిట్‌‌గా, హ్యాపీగా ఉన్నారు.