వందల కోట్ల పనులు జరుగుతున్నా కనిపించని స్మార్ట్ లుక్ 

వందల కోట్ల పనులు జరుగుతున్నా కనిపించని స్మార్ట్ లుక్ 

స్మార్ట్ సిటీ  హోదా దక్కినా  కరీంనగర్ తీరు  మారలేదు. వందల కోట్లతో అభివృద్ధి  పనులు  జరుగుతున్నా  స్మార్ట్ లుక్  కనిపించడం లేదు. పనుల్లో  నాణ్యత లేదని  బీజేపీ నేతలు  ఆరోపిస్తుంటే కరీంనగర్  అభివృద్ధి  కావడం బీజేపీ నేతలకు  ఇష్టం లేదంటున్నారు  టీఆర్ఎస్ నేతలు. 
దేశంలోని కొన్ని పట్టణాలను, నగరాలను ఎంపిక చేసి వాటిని ఆకర్షణీయ నగరాలుగా ఎంపిక చేయాలని మోడీ సర్కారు 2014లో అధికారంలోకి వచ్చాక నిర్ణయించింది. ఇందులో భాగంగా జూన్ 23, 2017న కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ హోదా దక్కింది. అప్పట్లో  దేశ వ్యాప్తంగా 30 నగరాలను స్మార్ట్ నగరాలుగా గుర్తిస్తే అందులో తెలంగాణ నుంచి కరీంనగర్ కు చాన్స్ వచ్చింది. ఈ స్కీం కింద ఐదేళ్ల పాటు ఏడాదికి 200 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కలిపి ఖర్చు చేయాల్సి ఉంటుంది. 
కరీంనగర్ కంటే ముందు హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీగా కేంద్రం గుర్తించింది. అయితే హైదరాబాద్ కు బదులు కరీంనగర్ ను ఎంపిక చేయాలంటూ సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు కరీంనగర్ కు ఈ జాబితాలో చోటు దక్కింది. స్మార్ట్ సిటీ అభివృద్ధి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాధ్యత. రెండు  సమానంగా నిధులు కేటాయిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. కాంట్రాక్టుల కేటాయింపు ఆలస్యంతో చాలా పనులు పూర్తి కాలేదు. పూర్తయిన చోట నాసిరకం పనులు వెక్కిరిస్తున్నాయి. మరోవైపు రోడ్లను ఉపయోగించకపోవడం వల్ల ప్రజలకు స్మార్ట్ సిటీ ప్రయోజనాలు అందడం లేదు.
స్మార్ట్ రోడ్డులో ప్రత్యేక పార్కింగ్ జోన్లు, సైకిల్ ట్రాక్, ఫుట్ పాత్ లాంటివి ఏర్పాటు చేశారు. వీటిని ఎక్కడా వినియోగించడంలేదు. పార్కింగ్ స్థలాల్లో, ఫుట్ పాత్ లను  చిరువ్యాపారులు, మిర్చీ బండ్లు, పండ్ల వ్యాపారులు..ఆక్రమించుకున్నారు. సైక్లింగ్ కోసం వదిలినా దారిలో సైకిళ్లు నడిచే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో గత ఏడాది స్మార్ట్ సైక్లింగ్ కోసం ఎంపిక చేసిన నగరాల్లో కరీంనగర్ అర్హత కోల్పోయింది.
వీధి వ్యాపారులను క్రమబద్ధీకరించి..వారికి ప్రత్యేక వెండర్ జోన్స్ ఏర్పాటు చేయాలన్నది స్మార్ట్ సిటీ లక్ష్యం. ఇక్కడ 15 వేలకు పైగా వీధి వ్యాపారులున్నారు. ఇందులో భాగంగా 32 చోట్ల ప్రత్యేక స్థలాలు కేటాయించి స్ట్రీట్ వెండర్స్ కోసం కేటాయించారు. కొన్నిచోట్ల దుకాణ సముదాయాలు, షెడ్లు నిర్మించారు. 
ఈ స్థలాల్లోనే అమ్మకాలు,కొనుగోళ్లు జరగాలని చెప్పినా ఎవరూ వినడం లేదు. వీళ్లంతా ప్రధాన రహదారులకు రెండువైపుల ఉన్న ఫుట్ పాత్  ను ఆక్రమించుకున్నారు. దీంతో పాదచారులు నడిచేందుకు వీలు ఉండటం లేదు. స్మార్ట్  రోడ్లతో పాటు ప్రధాన కూరగాయల మార్కెట్ , టవర్ సర్కిల్ , జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, చొప్పదండి వైపు ఉన్న రోడ్లకు రెండువైపులా ఆక్రమణలు జరిగాయి. కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్లపై, తోపుడుబండ్లు, వాహనాల పార్కింగ్ తో అవి ఎందుకూ పనికి రాకుండా పోయాయి.  వీధివ్యాపారుల కోసం మూడు రకాల జోన్ల విధానం ప్రవేశ పెట్టారు. ఇందులో ఫ్రీ జోన్  కింద నిర్దేశించిన ప్రాంతాల్లో వ్యాపారం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. 
అంబర్ జోన్ లో షరతులతో వ్యాపారాలకు అనుమతులు ఉంటాయి. ఇందులో ఉదయం లేదంటే మధ్యాహ్నం నిర్ణీత సమయం వరకు వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతిస్తారు. రెడ్  జోన్ లో వ్యాపారాలు చేయడానికి అవకాశం ఉండదు. వీటన్నింటికీ వీధివ్యాపారులు లైసెన్స్  తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. 
స్మార్ట్ సిటీ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. పనులు ప్రారంభం కాకపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టెండర్లలో అక్రమాలు జరిగాయని కోర్టులో కేసులు వేశారు. పనుల్లో నాణ్యతలేదని, అక్రమాలు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వడం లేదని ఈమధ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రికి ఎంపీ హోదాలో బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు కేంద్రం 196 కోట్ల రూపాయల నిధులు ఈ ప్రాజెక్టు కింద విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 100 కోట్లు కేటాయించినట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ నిధులు కేంద్రం ఇచ్చిన వాటి నుంచే చూపించారని బీజేపీ నేతలు అంటున్నారు. బండి సంజయ్.. స్మార్ట్ సిటీని అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇందులో భాగంగానే మంత్రికి ఫిర్యాదు చేశారన్నారు మేయర్ సునీల్ రావు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని చెప్పడం సరికాదన్నారు మంత్రి గంగుల కమలాకర్.  పనులు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే రోడ్ల ఆక్రమణలు తొలగిస్తామన్నారు. 
కరీంనగర్ లో కనీస మౌలిక సదుపాయాల కోసం 1878 కోట్లతో ప్రాజెక్టులకు తయారు చేశారు అధికారులు. ప్రాధాన్యత క్రమంలో 21 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి  టెండర్లు పిలిచారు.ఇప్పటివరకు ఒకే ఒక్క పని పూర్తి చేశారు.  కమాన్ చౌరస్తాకు మెరుగులు దిద్ది.. ఫౌంటేన్ నిర్మించారు. కలెక్టరేట్, శాతవాహన యూనివర్శిటి, భగత్ నగర్ టూ బైపాస్ రోడ్డు, హౌజింగ్ బోర్డు కాలనీ ప్రాంతాల్లో రోడ్లు పూర్తయ్యాయి. ఇంకా చాలా చోట్ల పనులు జరుగుతున్నాయి. 
రూ.217 కోట్లతో స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం, పార్కుల సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజీ  పనులు కొసాగుతున్నాయి. జ్యోతీభా పూలే గ్రౌండ్ లో పార్కు పూర్తయింది. దీనికి అనుబంధంగా ఉన్న  ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ పార్కు పనులు ఇంకా జరుగుతున్నాయి.  కరీంనగర్ లోని టవర్ సర్కిల్ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీకే ఓ రోల్ మోడల్ ఉండే ఏరియాగా తీర్చిదిద్దాలన్నది ప్లాన్. ఈ ఏరియాలోని భవనాలు, రోడ్లు, ఫుట్ పాతలన్నీ పునర్ నిర్మిస్తారు. దీనికి రిట్రోఫిట్టింగ్ ఏరియా అని పేరు పెట్టి 1410 కోట్లు ఖర్చు చేయనున్నారు. 
మిగతా ప్రాంతమంతా  ప్యాన్ సిటీ కింద 468 కోట్లను ఖర్చు చేయాలని  ప్రతిపాదించారు. రిట్రో ఫిట్టింగ్ ఏరియాలో భాగంగా టవర్ సర్కిల్ చుట్టూ ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోని 2 వేల 320 ఎకరాల స్థలం గుర్తించి, ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాల్సి ఉంది. కానీ,  పనులు పునాది దశలోనే ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలు ప్రజలను వెంటాడుతున్నాయి. పనులలో నాణ్యతాలోపాలు జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. ఫుట్ పాత్ ల ఆక్రమణ తొలగించి వెండర్స్ జోన్ లో వ్యాపారాలు చేసుకునేలా  అవకాశం కల్పించాలంటున్నారు.