- తెలంగాణలోనే తొలి గ్లాస్ బ్రిడ్జి
- 15 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద హార్ట్ షేప్‌లో గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా సాగుతోంది. మరో 15 రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తై పర్యాటకులకు అందుబాటులో రానుంది. రూ. 18 కోట్లతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు చేపట్టగా.. ఇప్పటికే బతుకమ్మ ఘాట్ ఫూర్తి అయింది. చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా.. చెరువుపై హృదయాకారంలో గ్లాస్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. చెరువు నీళ్ల మీద సుమారు 20 అడుగుల ఎత్తులో, అత్యాధునిక టెక్నాలజీతో ఈ వంతెన నిర్మాణం ప్రారంభించారు.
1.5 మీటర్ల వెడల్పు, 150 మీటర్ల పొడవులో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి పూర్తిగా గ్లాస్ ప్యానెల్స్‌ను అమరుస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్లాస్ ప్యానెల్స్ అమరిక, సేఫ్టీ టెస్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. అన్ని టెస్ట్‌లు పూర్తి చేసి మరో 15 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఎల్లమ్మ చెరువు వద్ద గ్లాస్ బ్రిడ్జితో పాటు బతుకమ్మ ఘాట్, లైటింగ్, పర్యాటకులను ఆకట్టుకునేలా చుట్టూ పచ్చటి వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టారు.

