సత్య హీరోగా రితేష్ రానా తెరకెక్కించిన చిత్రం ‘జెట్‌లీ’. రియా సింఘా హీరోయిన్. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్ద మల్లు నిర్మించారు. మే 1న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత చెర్రీ మాట్లాడుతూ ‘నాకు చిన్న చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనే ఆసక్తి ఎక్కువ. అందుకే మత్తు వదలరా, హ్యాపీ బర్త్‌డే, మీటర్, ఇప్పుడు జెట్‌లీ సినిమాలు చేశా. ఇదొక డిఫరెంట్ స్టోరీ. సినిమాలో ఎనభై శాతం ఫ్లైట్‌లోనే ఉంటుంది.
మొదట సీరియస్ థ్రిల్లర్‌గా చేయాలనుకున్నాం. కథ డెవలప్ చేశాం. కొంతమంది హీరోలకు చెప్పినా, వారికి తగ్గట్టుగా ఈ కథ కుదరలేదు. ఇది రెగ్యులర్ హీరో సినిమా కాదు. అందుకే రితేష్ దీన్ని కామెడీ థ్రిల్లర్‌గా మార్చాడు. అందరికీ ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి. యాక్షన్ కూడా సినిమాటిక్ లిబర్టీతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కామెడీ సినిమా అంటే కేవలం నవ్వులు కాదు. మంచి కథ కూడా ఉండాలి. అలాంటి కథ ఇందులో ఉంది. ఖచ్చితంగా మెప్పిస్తుంది’ అని చెప్పారు.

