టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ కు హుజురాబాద్ టాస్క్

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ కు హుజురాబాద్ టాస్క్

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్​రావుకు హుజూరాబాద్  బైపోల్ అగ్ని పరీక్షలా మారింది. కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత టీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ హుజూరాబాద్​ ఎన్నికల బాధ్యతలను పూర్తిగా హరీశ్​కు అప్పగించారు. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ను వ్యూహాత్మకంగా దూరం ఉంచారు.  కేసీఆర్​ ఆదేశాలతో హరీశ్​రావు రెండున్నర నెలలుగా సిద్దిపేటలోనే మకాం పెట్టి.. అక్కడి నుంచే రోజూ హుజూరాబాద్​ రాజకీయాలకు సంబంధించి చక్రం తిప్పుతున్నారు. ఈటలను ఎలాగైనా ఓడించాలని కేసీఆర్​ టార్గెట్​ పెట్టడంతో.. ఇటు లోకల్​గా పార్టీ నేతలను కాపాడుకోవడంతోపాటు, అటు ఈటల అనుచరులకు వల వేసేందుకు హరీశ్​ ప్రయత్నిస్తున్నారు. ఇంతగా ప్రయత్నిస్తున్నా నియోజకవర్గంలో పార్టీ ఓడిపోతే అది తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని హరీశ్​ సతమతమవుతున్నారు. 

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​ తనకు ఇచ్చిన హుజూరాబాద్​ టాస్క్​ను పూర్తి చేసేందుకు హరీశ్​రావు  శ్రమిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సహచరుడిగా ఉన్న ఈటల రాజేందర్​తో ఆయన ‘నువ్వా నేనా’ అన్నట్లుగా తలపడుతున్నారు. టీఆర్​ఎస్​ను గెలిపించేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఈటల బర్తరఫ్​ అయ్యేంత వరకు ఈటలకు, హరీశ్​కు మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. తనతో పాటు హరీశ్​ కూడా టీఆర్​ఎస్​లో  ఎన్నోసార్లు  అవమానాలకు గురైనట్లు ఈటల ఇటీవల గుర్తుచేసుకున్నారు. అయితే.. కేబినెట్ నుంచి ఈటలను తప్పించిన తర్వాత హరీశ్​కు సీఎం కేసీఆర్​ ప్రయారిటీ  ఇచ్చి హుజూరాబాద్​ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ సెగ్మెంట్​లో ఈటలకు దీటైన సెకండ్ కేడర్  పార్టీలో లేకపోవటంతో హరీశ్​ పరేషాన్​ అవుతున్నారు. 

రోజూ సిద్దిపేటలో మీటింగ్​లు

ఈటల గెలిస్తే రాష్ట్రంలోనే టీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు, వీలైనంత మందిని పార్టీలో చేర్చుకునేందుకు తలుపులు తెరిచారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా సరే తనకు కేసీఆర్​ అప్పగించిన టాస్క్​ను నెరవేర్చేందుకు హరీశ్​ వ్యూహాలకు పదును పెట్టారు. రోజూ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలను సిద్దిపేటకు రప్పించుకొని సమావేశమవుతున్నారు.  రెండు నెలలుగా మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్​కుమార్  హుజూరాబాద్​లో ఊరూరా తిరుగుతున్నారు. పలువురు మంత్రులు కులాలవారీగా మీటింగ్​లు పెట్టి వచ్చారు. ఇటీవల మాజీ ఎంపీ రమణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా కాంగ్రెస్‌‌‌‌ నేతలు కౌశిక్‌‌‌‌రెడ్డి, స్వర్గం రవి టీఆర్​ఎస్​లో చేరారు. ఈటల మాజీ అనుచరుడు బండ శ్రీనివాస్‌‌‌‌కు ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పదవి ఇచ్చారు. వీరందరినీ పార్టీలోకి రప్పించడంలో, బండ శ్రీనివాస్​కు పదవి ఇప్పించడంలో హరీశ్​ చక్రం తిప్పారు.  

హుజూరాబాద్​ టాస్క్​ హరీశ్​కు  కత్తిమీద సాములా మారింది. ఉద్యమంలో కలిసి పని చేయటం, పార్టీలో ఎంతోకాలం తనతో కలిసి మెలిగిన ఈటలపై బాహాటంగా ఆరోపణలు, విమర్శలు చేసేందుకు హరీశ్​  వెనుకడుగు వేస్తున్నారు. వరుసగా గెలిచిన ఈటలకు సొంత సెగ్మెంట్​లో గట్టి పట్టుంది.  ప్రజల్లో  సానుభూతి ఉంది. అనారోగ్యంతో ఈటల హాస్పిటల్​లో ఉండగా.. వీల్​ చైర్​లోనైనా ఈటల ప్రచారానికి రాగలరని, ఆయన ఎత్తుగడలకు ప్రజలు మోసపోవద్దంటూ హరీశ్​ చేసిన కామెంట్లు విమర్శలపాలయ్యాయి.  ఈ కామెంట్లు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ ఈటల కౌంటర్​ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో  చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపైనా స్థానిక టీఆర్​ఎస్​ నాయకత్వం గుర్రుగా ఉంది. దళితబంధుతో పాటు  బైపోల్ కోసం కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నా.. మాజీ మంత్రి సహా ముఖ్య నేతలందరినీ గులాబీ గూటికి చేర్చినా హుజూరాబాద్​లో పార్టీకి ఎడ్జ్ రాలేదనే అసహనంతోనే హరీశ్​రావు​ హుజూరాబాద్​లో అడుగుపెట్టడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. బై పోల్​లో టీఆర్ఎస్  ఓడితే పరోక్షంగా ఈటలకు సహకరించారన్న అపవాదును ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం హరీశ్​ను వెంటాడుతోంది. దుబ్బాక తర్వాత రెండో ఓటమి ఎదురైతే భవిష్యత్తులో పార్టీలోనూ హరీశ్​కు ప్రాధాన్యం తగ్గవచ్చని టీఆర్​ఎస్​ లీడర్లు భావిస్తున్నారు.