హైదరాబాద్ లో ట్రేడింగ్ పేరుతో భారీ స్కాం.. వృద్ధుడి నుంచి రూ. 93 లక్షలు కాజేసిన చీటర్స్..

హైదరాబాద్ లో ట్రేడింగ్ పేరుతో భారీ స్కాం.. వృద్ధుడి నుంచి రూ. 93 లక్షలు కాజేసిన చీటర్స్..

హైదరాబాద్ లో ట్రేడింగ్ పేరుతో జరిగిన భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్ పేరుతో 70 ఏళ్ళ వృద్ధుడి నుంచి రూ. 93 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. జులై 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..  స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో వాట్సాప్ లో వచ్చిన లింక్ క్లిక్ చేసి మోసపోయానంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు మేడ్చల్ కి చెందిన 70ఏళ్ళ వృద్ధుడు. 

మొదట రాజ్ కుమార్ అనే వ్యక్తిగా టీం హెడ్ గా వాట్సాప్ లో పరిచయం అయ్యాడని.. ఆ తర్వాత నిఖితా శర్మ అనే మహిళ గ్రూప్ అనలిస్ట్ గా పరిచయం చేసుకుందని తెలిపాడు బాధితుడు. మొదట నిఖిత ట్రేడింగ్ పేరుతో ఆగస్టు 26న తన నుంచి రూ. రెండు లక్షలు వసూలు చేసిందని తెలిపాడు బాధితుడు.

ఆ తర్వాత ట్రేడింగ్ గురించి గైడ్ చేస్తూ.. రూ. 30 లక్షల వరకు వసూలు చేశారని తెలిపాడు బాధితుడు. మొదట ట్రేడింగ్ ఆపాలని అనుకున్నప్పటికీ రూ. 50 లక్షలు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి.. రూ. 93 లక్షల 7 వేల 417 కాజేశారని వాపోయాడు బాధితుడు.

ఆ తర్వాత అక్టోబర్ 8న తాను పెట్టుబడి పెట్టిన సొమ్ము నుంచి రూ. 20 లక్షలు విత్ డ్రా చేయాలని ప్రయత్నించగా.. నేరగాళ్లు తన నుంచి మరింత సొమ్ము కాజేయాలని చూశారని తెలిపాడు బాధితుడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో జరిగిన మోసం బయటపడింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెట్టుబడుల పేరుతో వాట్సాప్ లో వచ్చే లింకులను క్లిక్ చేయొద్దని.. అధిక లాభాల కోసం ఆశపడి నష్టపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.