పెళ్లి దుస్తుల్లో ఓయో రూంలో శవమై కనిపించాడు.. హైదరాబాద్ అడ్డగుట్టలో ఘటన

పెళ్లి దుస్తుల్లో ఓయో రూంలో శవమై కనిపించాడు.. హైదరాబాద్ అడ్డగుట్టలో ఘటన

హైదరాబాద్: పెళ్లి దుస్తుల్లో ఉన్న యువకుడు ఓయో రూమ్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీలో కలకలం రేపింది. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన వనమాల ప్రకాశ్(38) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయన తమ్ముడు వనమాల లోకేష్ (29)కు ఉద్యోగం లేదు. గత మూడు సంవత్సరాలుగా చింతల్ గణేష్‌నగర్‌లో నివసిస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో.. లోకేష్‌కు అంబిక అనే యువతితో పరిచయం ఏర్పడి, ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని, కుటుంబాలకు తెలియజేయగా, రెండు కుటుంబాలు కూడా పెళ్లికి అంగీకరించాయి.

అయితే.. ఏప్రిల్ 3న అంబిక తల్లిదండ్రులు ఆమె గదికి వెళ్లగా, ఆమె కనిపించలేదు. దీంతో వారు లోకేష్ గురించి ప్రకాశ్‌ను సంప్రదించారు. అనంతరం ఇద్దరూ లోకేష్ గదికి వెళ్లగా, అతను కూడా అక్కడ లేడని గుర్తించారు. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లి ఉంటారని అంతా భావించారు. ఇంతలో లోకేష్ స్నేహితుడు ఫోన్ చేసి, “మిస్ యూ బై” అంటూ మెసేజ్ పంపి తన లొకేషన్ షేర్ చేశాడని తెలిపాడు. వెంటనే ఆ లొకేషన్ ఆధారంగా ప్రకాశ్ కేపీహెచ్బీకి వెళ్లాడు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో లోకేష్ అపస్మారక స్థితిలో కనిపించాడు.

వైద్యులను అడగగా.. లోకేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అనంతరం విచారణలో తెలిసిన వివరాల ప్రకారం, అదే రోజు ఉదయం సుమారు 10 గంటలకు లోకేష్, అంబిక ఇద్దరూ అడ్డగుట్టలోని ఓయో హోటల్‌లో గది తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత లోకేష్, అంబికను ఆహారం తీసుకురావడానికి పంపించాడు. తర్వాత ఆమె తిరిగి రాగానే గది తలుపు లోపల నుంచి మూసి ఉండటంతో, హోటల్ సిబ్బంది, లోకేష్ స్నేహితులకు ఆమె సమాచారం ఇచ్చింది.

మధ్యాహ్నం సుమారు 2:40 గంటలకు తలుపు బద్ధలు కొట్టి చూడగా, లోకేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. లోకేష్ స్వస్థలం ఏపీలోని అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామం. అయితే.. లోకేష్ పెళ్లి దుస్తుల్లో చనిపోయి కనిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ/ఏఎస్‌ఐ ఏ. జగన్ తెలిపారు.