- పరిశీలించిన హైడ్రా చీఫ్రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: పాతబస్తీలోని చారిత్రక బమృక్‌నుద్దౌలా చెరువు పూర్వవైభవం సంతరించుకుంటోంది. ఆక్రమణలతో కుచించుకుపోయిన ఈ చెరువును భావితరాలకు అందించేలా తీర్చిదిద్దుతున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మంగళవారం ఆయన చెరువును పరిశీలించి మాట్లాడుతూ 15 రోజుల్లో చెరువు ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.
గత ఏడాది ఆగస్టు నుంచి ఆక్రమణలు తొలగిస్తూ చుట్టూ బండ్, ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు, మూడు వైపులా ఎంట్రీలు ఏర్పాటు చేశారు. నిజాం కాలంలో ఔషధ గుణాలున్న నీటికి ప్రసిద్ధి చెందిన ఈ చెరువు చరిత్రను పునరావృతం చేసేలా ఔషధ మొక్కలు, నీడనిచ్చే చెట్లు నాటాలని రంగనాథ్ఆదేశించారు. వాకింగ్ ట్రాక్, లైటింగ్, పిల్లల ప్లే ఏరియా, వృద్ధుల సీటింగ్ జోన్లు, ఓపెన్ జిమ్, పార్కు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి హైడ్రా హెడ్డాఫీసు నుంచి పర్యవేక్షించాలన్నారు.
30 ఏండ్ల మురుగు సమస్యకు పరిష్కారం
బషీర్‌బాగ్: హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 14లోని ఆదర్శ్‌నగర్ బస్తీలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న మురుగు సమస్యను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. మురుగు నీరు ఇళ్లలోకి చేరుతోందని, బోరుబావులు కలుషితం అవుతున్నాయని తమ ఇబ్బందులను స్థానికులు, కార్పొరేటర్ మహాలక్ష్మీ రామన్‌గౌడ్ వివరించారు. హుస్సేన్‌సాగర్ నాలా సమీపంలో ఉండడమే ఈ సమస్యకు కారణమని అధికారులు తెలిపారు.
దీంతో సమస్యను బస్తీ వరకు కాకుండా హుస్సేన్‌సాగర్ నాలా వరకు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. దెబ్బతిన్న పైప్‌లైన్ స్థానంలో పెద్ద పైపులు వేయాలని జలమండలి అధికారులకు సూచించారు. వర్షాకాలం ముగిసినందున వెంటనే పనులు ప్రారంభించాలని, అలాగే హుస్సేన్‌సాగర్ రిటైనింగ్ వాల్లో 35 మీటర్ల దెబ్బతిన్న భాగాన్ని అత్యవసరంగా పునరుద్ధరించాలని ఆదేశించారు.
