
న్యూఢిల్లీ, వెలుగు: ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇకపై చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఊరుకునేది లేదని హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవి లత హెచ్చరించారు. బీజేపీ రిలీజ్ చేసిన లోక్‌సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌లో హైదరాబాద్ అభ్యర్థిగా మాధవి లత పేరును ప్రకటించడంపై ఆమె పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసుకు వెళ్లి.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్‌ను కలిసి థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ ఆమెకు పార్టీ కండువా కప్పి, అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను సంఘ్ పరివార్ నుంచి వచ్చానని, పార్టీలో లేనన్న కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోనన్నారు. సొంత ఇంట్లో వాళ్లు చేసే వ్యాఖ్యలు ఇబ్బందికరం కాదని పేర్కొన్నారు. సంఘ్ పరివార్ కార్యకర్తగా చేసిన సేవే తనకు టికెట్ వచ్చేలా చేసిందని ఆమె తెలిపారు. ధర్మం, న్యాయం తెలిసిన తాను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. చాలా ఏండ్లుగా హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్న అసదుద్దీన్ ఒవైసీ.. మైనారిటీలకు, హిందువులకు న్యాయం చేయట్లేదని మండిపడ్డారు. ఈసారి హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మార్పు కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు.