- 44 మందిని మోసగించిన భార్యాభర్తలు, కుమార్తె
కూకట్‌పల్లి, వెలుగు : చీటీల బిజినెస్ పేరుతో కుమార్తెతో కలిసి భార్యాభర్తలు జనానికి కుచ్చుటోపీ పెట్టారు. 44 మంది నుంచి రూ.16 కోట్ల వరకు వసూల్ చేసి పత్తా లేకుండా పోయారు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా సైబరాబాద్ ఈవోడబ్ల్యూ ఠాణాలో ముగ్గురిపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ అడ్డగుట్టలోని హెచ్ఎంటీ హిల్స్ వాసి రమణారెడ్డికి కేపీహెచ్‌బీకి చెందిన వెంకటేశ్వరరావుతో పదేళ్లుగా పరిచయం ఉంది. రమణారెడ్డి, భార్య సీత, కుమార్తె హర్షితరెడ్డి.. తాము చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు స్థానికంగా చెప్పుకునేవారు. తమ వద్ద చీటీలు వేయాలని రమణారెడ్డి పదే అడగడంతో వెంకటేశ్వరరావు 2025 ఏప్రిల్ నుంచి రెండు చిట్టీలు వేస్తూ మొత్తం రూ.12.70 లక్షలు బదిలీ చేశారు.
ఆ తర్వాత వ్యాపార అవసరాల కోసం డబ్బు కావాలని, రమణారెడ్డి చెప్పగా.. వెంకటేశ్వరరావు మరో రూ.50 లక్షలు సర్దుబాటు చేశారు. ఇందుకు 2 శాతం వడ్డీ ఇస్తామని చెప్పారు. పూచీకత్తు కింద సీత ఐదు పోస్టు డేటెడ్ చెక్కులను వెంకటేశ్వరరావుకి ఇచ్చింది. ఆ తర్వాత ఫోన్లకు స్పందించడం లేదు. ఇంటి కెళ్లి చూడగా ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. తనలాగే మరికొందరి వద్ద చిట్టీల పేరిట డబ్బు వసూలు చేసినట్లు తెలుసుకున్న వెంకటేశ్వరరావు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు కలిసి చీటీల పేరుతో మొత్తం 44 మంది దగ్గర రూ.16 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
