నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాలుగు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నా కూడా మంటలు అదుపులోకి రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. బిల్డింగ్ సెల్లార్ లో వాచ్ మెన్ యాదయ్య పిల్లలు, మరో కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు సెల్లార్ లోనే చిక్కుకుపోయారు. ఈ ఘటన కారణంగా నాంపల్లి స్టేషన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వెళ్లే సందర్శకులకు కీలక సూచన చేశారు పోలీసులు. ఇవాళ నుమాయిష్ వెళ్లడం వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.
ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, నుమాయిష్ సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు వాయిదా వేసుకోవాలని సూచించారు హైదరాబాద్ సీపీ సజ్జనార్.నాంపల్లి, అబిడ్స్ రూట్ క్లోజ్ చేసిన విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని..ఈ రూట్ లో వచ్చి ఇబ్బందులు పడొద్దని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కు మరింత సమయం పడుతుందని తెలిపారు సజ్జనార్.
Also Read : నాంపల్లిలో 4 గంటలుగా ఆగని మంటలు
ఇదిలా ఉండగా.. సుమారు నాలుగు గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా మంటలు అదుపులోకి రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. బిల్డింగ్ నాలుగు ఫ్లోర్లలో దట్టమైన పొగ కమ్మేయడంతో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు ఆటంకంగా మారింది.
ఈ క్రమంలో బిల్డింగ్ అద్దాలు పగలకొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ , ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సెల్లార్ చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది రెస్క్యూ టీం.
