- ఓటీపీ అడిగి డబ్బులు గుంజుతున్న సైబర్ నేరగాళ్లు
- మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచన
హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబర్ నేరగాళ్లు ‘సర్’ పేరుతో మోసాలకు దిగుతున్నారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. ‘సర్’ పేరుతో ఓటర్లను టార్గెట్ చేస్తూ కొత్త స్కామ్‌కు తెరతీశారని, ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఎన్నికల ఆఫీసర్ల పేరుతో వచ్చే ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ఎలా మోసం చేస్తారంటే..?
ఈ స్కామ్‌లో భాగంగా కేటుగాళ్లు తాము బూత్ లెవెల్ ఆఫీసర్లమని (బీఎల్వో), ఎన్నికల అధికారులమని పరిచయం చేసుకుంటారు. ఓటరు లిస్టులో మీ పేరును వెరిఫై చేయడానికి లేదా డీటెయిల్స్ అప్‌డేట్ చేయడానికని నమ్మిస్తారు. ఆ తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని అడుగుతారు. ‘‘ఎన్నికల సంఘం కానీ, బూత్ లెవెల్ అధికారులు కానీ ఫోన్ కాల్స్ ద్వారా ఎప్పుడూ ఓటీపీలను అడగరు.
కేవలం అధికారిక ఈసీఐ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే ఓటర్లు తమ వివరాలను వెరిఫై చేసుకోవాలి. గుర్తుతెలియని వ్యక్తులతో వీటిని అస్సలు పంచుకోవద్దు.”అని సీపీ సజ్జనార్ సూచించారు. ఒక్క ఓటీపీని షేర్ చేయడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బుతో పాటు పర్సనల్ ఇన్ఫర్మేషన్ సైబర్ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని సీపీ హెచ్చరించారు. ఒకవేళ మీకు ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే.. వెంటనే ఫోన్ కట్ చేసి, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయాలన్నారు. లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
