బషీర్‌బాగ్, వెలుగు: సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పాటు యాప్ నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భారీ లాభాలు వస్తాయంటూ మోసపూరిత హామీలు ఇస్తూ బెట్టింగ్‌లో పాల్గొనాలని యువతను ఆకర్షిస్తున్నట్లు తేలింది.
ఫేక్ ప్రిడిక్షన్‌లు ఇస్తూ ప్రజలను బెట్టింగ్ కు మభ్యపెడుతున్నట్లు గుర్తించారు. సైబర్ పెట్రోలింగ్ విభాగం దర్యాప్తులో మొత్తం 18 సోషల్ మీడియా పేజీలు ఐపీఎల్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలిసింది. సైబర్ పెట్రోలింగ్ విభాగం ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
