- కిచెన్ నుంచి వాసన రావడంతో పోలీసులకు అద్దెదారుల కంప్లైంట్
- కేసును ఛేదించిన పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ నగరంలోని నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన వంటగది మృతదేహం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడన్న కోపంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్యచేసి, ఎవరికీ అనుమానం రాకుండా వంటగది ప్లాట్‌ఫాం కింద సమాధి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ సికింద్రాబాద్‌లో శనివారం మీడియాకు వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిజనగండ్ల గ్రామా నికి చెందిన గవ్వల మల్లేష్ (47) ప్లంబర్‌గా పనిచేస్తూ నేరెడ్‌మెట్ జేకే కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్‌కోట గ్రామానికి చెందిన కంచి వెంకటరాములు (47) తో అతనికి కూలి పనుల వద్ద పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్ 15న మల్లేష్ తన గదిలో వెంకటరాములుతో కలిసి మద్యం సేవిస్తుండగా.. మల్లేష్ భార్య గురించి వెంకటరాములు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన మల్లేష్.. పక్కనే ఉన్న కర్రతో అతని తలపై బలంగా బాదాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నిందితుడు మృతదేహాన్ని వంటగది ప్లాట్‌ఫాం కింద ఉన్న ఖాళీ ప్రదేశంలో దాచి ఇటుకలతో గోడ కట్టి సిమెంట్‌తో పూడ్చేశాడు.
కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో భయపడి ఇంటికి తాళం వేసి జగిత్యాలకు పారిపోయాడు. ఐదు నెలలుగా మల్లేష్ కనిపించకపోవడంతో ఇంటి యజమాని ఆ గదిని వేరే వారికి అద్దెకు ఇచ్చాడు. కొత్తగా వచ్చిన వారు ఇల్లు శుభ్రం చేస్తుండగా వంటగది నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడ తవ్వగా కుళ్ళిన స్థితిలో ఉన్న అస్థిపంజరం బయటపడింది.
సాంకేతిక ఆధారాలు, లేబర్ అడ్డా వద్ద ఆరా తీసిన పోలీసులు.. మృతుడిని రాములుగా గుర్తించారు. చివరగా అతను మల్లేష్‌తో కలిసి ఉన్నాడని తెలుసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. జగిత్యాలలో తలదాచుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు గతంలో తన సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి పోక్సో కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన ఏసీపీ యాదగిరి రెడ్డి, సీఐ సందీప్ కుమార్ బృందాన్ని డీసీపీ శ్రీధర్ అభినందించారు.
