అమెరికా వీసా రాలేదని హైదరాబాద్‌‌లో డాక్టర్ ఆత్మహత్య

 అమెరికా వీసా రాలేదని హైదరాబాద్‌‌లో డాక్టర్ ఆత్మహత్య
  • నిద్ర మాత్రలు మింగిచనిపోయిన యువతి 

పద్మరావునగర్, వెలుగు: అమెరికా వీసా రాలేదనే మనస్తాపంతో ఓ డాక్టర్​ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌‌లోని చిలకలగూడలో జరిగింది. ఏపీలోని గుంటూరుకు చెందిన డాక్టర్‌‌ రోహిణి కజకిస్తాన్‌‌లో ఎంబీబీఎస్​పూర్తి చేసింది. 2022లో ఫారిన్​మెడికల్​గ్రాడ్యుయేట్​ఎగ్జామ్ ​క్లియర్ చేసి ఇండియాలో లైసె న్స్​కూడా పొందింది. అమెరికా వెళ్లి  మెడికల్ పోస్ట్‌‌ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్, రెసిడెన్సీ చేయాలనే కలలు కనేది. 

ఈ క్రమంలోనే అమెరికాలోని న్యూయార్క్​వెళ్లి బ్రోంక్స్​లోని మాంటీఫెరీ మెడికల్​సెంటర్​కు వెళ్లి అడ్మిషన్ లెటర్, ఈసీఎఫ్​ఎమ్​జీ సర్టిఫికెట్లు రెడీ చేసుకుంది. అన్ని ఏర్పాట్లు చేసుకుని జే1 వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ వీసాను విద్యార్థులు, రీసెర్చర్లు, డాక్టర్లకు ఇస్తారు. డొనాల్డ్​ ట్రంప్​ అమెరికా అధ్యక్షడు అయిన తర్వాత వీసా నిబంధనలు కఠినతరం చేయడం రోహిణికి సమస్యగా మారింది. 

మొదటి మూడు విడతల టెస్టులు పూర్తి చేసుకున్న ఆమెకు చివరి రౌండ్‌‌లో నిరాశే ఎదురైంది. గత నెల హైదరాబాద్‌‌లోని యూఎస్​కాన్సులేట్‌‌లో వీసా ఇంటర్వ్యూ జరగ్గా వీసా రాలేదు. పొటెన్షియల్​ఇంటెంట్​టు ఇమిగ్రేట్( శాశ్వతంగా అమెరికాలోనే ఉండిపోవాలనే ఉద్దేశం) కారణాన్ని చూపుతూ వీసా రిజెక్ట్​చేశారు. 

జే1 వీసాకి ఈ కారణాన్ని అరుదుగా వాడుతుంటారు. పైగా స్టెప్​వన్​యూఎస్​ఎంఎల్ఈ స్కోర్స్ 248 రాగా, స్టెప్​2 సీఎకే 252 వచ్చింది. ఇవి అమెరికాలో టాప్ రెసిడెన్సీలకు సరిపోతాయి. అయినా జే1 వీసా రాకపోతే జాయిన్​అయ్యే అవకాశం లేదు. మరోవైపు వెంటనే వచ్చి జాయిన్​కావాలని అక్కడి యూనివర్సిటీ నుంచి సమాచారం రావడంతో ఒత్తిడికి గురైంది. తన అమెరికా కల చెదిరిపోతుందనే నిరాశలో డిప్రెషన్‌‌కు గురై ఆత్మహత్య చేసుకుంది.