ఫిలింనగర్‌ ఎన్‌ఆర్‌ఐ హత్య కేసులో.. ఇద్దరి అరెస్టు

ఫిలింనగర్‌ ఎన్‌ఆర్‌ఐ హత్య కేసులో.. ఇద్దరి అరెస్టు

ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాలుగు రోజుల(జనవరి 14) క్రితం జరిగిన హాత్య కేసులో దోషులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. నిందితుడికి మృతుని భార్యతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. శాస్త్రిపురం ప్రాంతానికి చెందిన అద్నాన్‌ హుస్సేన్‌ (40) లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. షేక్‌పేటలోని జైహింద్‌ కాలనీకి చెందిన వివాహిత (31) 2022లో సైకాలజీలో పీజీ చేసేందుకు లండన్‌ వెళ్లింది.

అయితే అక్కడ పేయింగ్‌ అకామిడేషన్‌ కోసం చూస్తుండగా.. అద్నాన్‌ హుస్సేన్‌ పరిచయమయ్యాడు. అతడు ఉంటున్న అపార్ట్‌మెంటులోనే షేరింగ్‌ రూమ్‌ తీసుకున్న వివాహితతో అద్నాన్‌కు స్నేహం ఏర్పడింది. నాలుగు నెలల తర్వాత ఆమె భర్త గౌస్‌ మొయినుద్దీన్‌, ముగ్గురు పిల్లలతో కలిసి లండన్‌కు వెళ్లారు. కానీ వారికి అక్కడి వాతావరణం పడకపోవడంతో ఇండియాకు తిరిగి వచ్చారు. చదువు కోసం భార్య అక్కడే ఉండి.. 2023 నవంబర్‌లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది.

అక్కడ ఉన్నప్పటి నుంచే ఇద్దరం పెళ్లి చేసుకుందామని, ఇండియాకు వెళ్లి భర్తకు విడాకులు ఇచ్చిరావాలని అద్నాన్‌ వేధించడం మొదలుపెట్టాడు. లండన్‌లో ఉన్న సమయంలో అతడితో దిగిన ఫొటోలు చూపించి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరించడం ప్రారంభించాడు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారే ముఖ్యమని ఆమె పలుమార్లు చెప్పినా అతడు పట్టించుకోలేదు. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అతడి వేధింపులు కొనసాగడంతో.. 2023 నవంబర్‌లో బాధితురాలు ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ 354 (డి), 506(2)తో పాటు ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో జనవరి 14వ తేదీ రాత్రి గౌస్‌ మొహియుద్దీన్‌ ఇంటికి వచ్చిన అద్నాన్‌.. అతడి భార్యను లాక్కొని వెళ్లేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న గౌస్‌ మొహియుద్దీన్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. హత్య తర్వాత మేనమామ మిర్జా ఫజల్‌ అలీ బేగ్‌ (42)ను పిలిపించుకుని అతడి బైక్‌పై పారిపోయాడు. నిందితుడు అద్నాన్‌ను మంగళవారం రాత్రి అరెస్టు చేసిన ఫిలింనగర్‌ పోలీసులు.. అతడు పారిపోయేందుకు సహకరించిన మేనమామ మిర్జా ఫజల్‌ అలీబేగ్‌ను సైతం అరెస్ట్‌ చేసి..నిన్న(జనవరి 17) రిమాండ్‌కు తరలించారు.