హైదరాబాద్ తొలి కరోనా పేషెంట్.. గాంధీ నుంచి డిశ్చార్జ్

హైదరాబాద్ తొలి కరోనా పేషెంట్.. గాంధీ నుంచి డిశ్చార్జ్

హైదరాబాద్ తొలి కరోనా పేషెంట్‌కు వ్యాధి పూర్తిగా నయమైంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి టెస్టుల్లో నెగటివ్ రావడంతో శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. అయితే అతడిని మరో 14 రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని డాక్టర్లు సూచించారు. కుటుంబసభ్యులను కూడా ఈ రెండు వారాలపాటు కలవకుండా ప్రత్యేక గదిలో ఉండాలని చెప్పారు.

ఐదు రోజుల పాటు వరుసగా టెస్టులు

సికింద్రాబాద్‌లోని మహేంద్రా హిల్స్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు మార్చి 2న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతడు దుబాయ్ వెళ్లి గత నెల 19న తిరిగి బెంగళూరు వచ్చాడు. ఫిబ్రవరి 22న బస్సులో హైదరాబాద్ వచ్చిన అతడికి జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉండడంతో దాదాపు వారం పాటు సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అయితే ఎంతకీ తగ్గకపోవడంతో కరోనా సోకిందన్న అనుమానంతో అపోలో అతడిని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. గాంధీలో అడ్మిట్ అయిన ఆ యువకుడికి టెస్టులు చేయగా పుణే వైరాలజీ ల్యాబ్ మార్చి 2న కరోనా ఉన్నట్లు తేల్చింది. నాటి నుంచి ఐసోలేషన వార్డులో ఉంచి చికిత్స చేశారు గాంధీ వైద్యులు. ఐదు రోజుల క్రితమే అతడికి టెస్టు చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. దీంతో మరోసారి క్లారిటీ కోసం పుణేకి కూడా శాంపిల్ పంపారు. అక్కడ కూడా నెగటివ్ వచ్చింది. అయితే గత ఐదు రోజులుగా వరుసగా టెస్టులు చేస్తూ వస్తున్నారు డాక్టర్లు. ప్రతి రోజూ కరోనా లేదని తేలడంతో శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు.

More News:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

కరోనా ఎఫెక్ట్: సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

ఆస్ట్రేలియా హోం మంత్రికి కరోనా: వారం క్రితమే ఇవాంకాతో భేటీ