- కోర్టు ఉత్తర్వుల ధిక్కరణకు ప్రాథమిక ఆధారాలు: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్టు ఆధారాలున్నాయని, దీనిపై హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లోని బతుకమ్మకుంట పరిధిలోని కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేటు స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదన్న హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందున కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు హైకోర్టు ఫాం-1 నోటీసులు జారీ చేసింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంపై యథాతథస్థితిని కొనసాగించాలని, స్థలాన్ని ఏ విధంగాను మార్పులు చేయరాదంటూ జూన్ 12న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎ.సుధాకర్‌రెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బి.ఆర్.మధుసూదన్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం పిటిషనర్ సమర్పించిన ఫొటోలను పరిశీలిస్తే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన జూన్ 12 నుంచి అక్టోబరు 5 వరకు చాలా వరకు పనులు చేపట్టి, ఆ స్థలం రూపురేఖలు మార్చినట్లు వెల్లడవుతోందని పేర్కొంది. బతుకమ్మ కుంటను హైడ్రా అభివృద్ధి చేసినట్లు అక్టోబరు 5న శిలాఫలకం ప్రారంభించినట్లు ఫోటోలో స్పష్టంగా ఉందని పేర్కొంది.
అంతేగాకుండా బతుకమ్మ కుంటను ప్రైవేటు ఏజెన్సీలు విమోస్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిజైన్ చేయగా, ఎన్‌పీఆర్ ఇన్‌ఫ్రాటెక్ నిర్మాణం చేపట్టినట్లు స్పష్టంగా ఉందని తెలిపింది. ఫొటోలను పరిశీలిస్తే వివాదాస్పద స్థలంలో మార్పులు, చేర్పులు చేసినట్లు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొంది. కోర్టు ధిక్కరణకు పాల్పడినవారి వ్యక్తిగత హాజరుకు సంబంధించి ఇదే హైకోర్టు గతంలో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ప్రస్తుత కేసులో వాస్తవాలను పరిశీలించిన తరువాత మినహాయింపు ఇవ్వలేమంటూ విచారణను నవంబరు 27కు వాయిదా వేసింది.
